'బాహుబలి'తో ఒక గ్రాఫిక్స్ ప్రధాన చిత్రానికి ఎంత రేంజ్ వుందనేది తెలిసింది. వెండితెరపై చూస్తే తప్ప ఆ 'కిక్' రాని తరహా భారీ చిత్రాల రూపకల్పన మరింతగా పుంజుకుంది. 'బాహుబలి'తో ఇలాంటి సినిమాలకి వున్న మార్కెట్ ఎంత అనేది తెలియడంతో చాలా మంది ఆ తరహా చిత్రాలకి శ్రీకారం చుడుతున్నారు.
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్ నటిస్తోన్న '2.0' టీజర్ ఇటీవలే విడుదలయింది. అయిదు వందల కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతోన్న ఈ టీజర్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. 'బాహుబలి'తో పోలిస్తే ఆకట్టుకోలేకపోయిందని, గ్రాఫిక్స్ అంతగా మెప్పించలేదని విమర్శలు వచ్చాయి.
అమీర్‌ఖాన్, అమితాబ్‌తో హిందీలో తీస్తోన్న 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రానికి విశేషమైన ప్రచారం జరుగుతోంది. కానీ ఈ చిత్రం ట్రెయిలర్ కూడా సాదాసీదాగానే అనిపించింది తప్ప బాహుబలి మాదిరిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ట్రెయిలర్స్ పరంగా బాహుబలికి సరితూగలేకపోయిన ఈ చిత్రాల్లో కంటెంట్, తెరపై గ్రాఫిక్స్ అయినా ఆ స్థాయిలో వుంటాయో లేదో అనేది చూడాలి.