నేత‌ల క‌డుపు కొట్టిన జ‌గ‌న్‌

సొంత పార్టీతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల క‌డుపు కొట్టారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌. ఎన్నిక‌లంటే డ‌బ్బు సంపాదించుకునే ఆదాయ వ‌న‌రుగా కొంద‌రు నేత‌లు , వాటి కోసం కాచుక్కూచొని ఉంటారు. అలాంటి నేత‌ల‌ను…

సొంత పార్టీతో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల క‌డుపు కొట్టారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌. ఎన్నిక‌లంటే డ‌బ్బు సంపాదించుకునే ఆదాయ వ‌న‌రుగా కొంద‌రు నేత‌లు , వాటి కోసం కాచుక్కూచొని ఉంటారు. అలాంటి నేత‌ల‌ను జ‌గ‌న్ చావు దెబ్బ కొట్టారు. అస‌లు తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఓటుకు నోటు పంచ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా నిర్ణ‌యించుకోవ‌డం …వివిధ పార్టీల నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.  

రాజ‌కీయ ప‌క్షాలు త‌మ శ‌క్తి మేర‌కు ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేయ‌డం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ప్ర‌ధానంగా ఏపీ అధికార ప‌క్షం వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, మూడో ప్ర‌త్యామ్నాయంగా రావాల‌నుకుంటున్న బీజేపీ మ‌ధ్య పోరు సాగు తోంది. 

ఏపీలో బీజేపీకి అంత సీన్ లేక‌పోయినా కేంద్రంలో వ‌రుస‌గా రెండోసారి అధికారం చెలాయిస్తుండ‌డంతో ఆ పార్టీ కూడా డ‌బ్బు పంపిణీ చేస్తుంద‌నే టాక్ నడిచింది. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ అభ్య‌ర్థిత్వం ఖ‌రారు కాగానే …ఆ పార్టీలోని కొంద‌రు నాయ‌కులు ఎగిరి గంతేశార‌ట‌!

ఐఏఎస్ అధికారిగా ర‌త్న‌ప్ర‌భ బాగా సంపాదించార‌ని, ఎన్నిక‌ల్లో ఆమె నుంచి ఎంతోకొంత డ‌బ్బు రాబ‌ట్టుకోవ‌చ్చ‌ని బీజేపీ నేత‌లు భావించార‌ట‌. అయితే ఆమె మాత్రం ఒక్క రూపాయి కూడా సొంత సొమ్ము తీయ‌క‌పోవ‌డంతో ఆశావ‌హులైన నేత‌లు ఉస్సూరు మ‌ని ఆమెకు దూరంగా జ‌రిగార‌ని స‌మాచారం. ఏవో సాకులు చెప్పి అస‌లు ప్ర‌చారానికి కూడా దూర‌మైన బీజేపీ విమానాశ్ర‌య బ్యాచ్ నాయ‌కులు కూడా ఉన్నార‌ని స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు పంపిణీ చేసేందుకు ఇచ్చే డ‌బ్బులో ఎంతోకొంత వెన‌కేసుకుందామ‌ని ఆశించిన వైసీపీ, టీడీపీ, బీజేపీ నేత‌ల‌కు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది. అలాంటి వాళ్లు వైస్ జ‌గ‌న్‌పై శాప‌నార్థాలు పెడుతున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా అధికారం పోగొట్టుకుని ఎడారిలో నీళ్ల కోసం ద‌ప్పిక‌గొన్న వాడిలో ఆవురావుర‌మంటున్న తిరుప‌తిలో టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయ‌కుడు వైరాగ్యం మాట‌లు మాట్లాడుతున్న‌ట్టు స‌మాచారం.  

మ‌రోవైపు అధికార పార్టీలోని కొంద‌రు నేత‌లు కూడా జ‌గ‌న్‌ను ఆడిపోసుకుంటున్నారు. అస‌లు డ‌బ్బు సంపాదించుకునే మార్గాల‌న్నీ మూసేస్తే …ఇక త‌మ‌లాంటి వాళ్లు బ‌తికేదెట్టా? అని వాపోతున్న‌ట్టు స‌మాచారం. ఇలాగైతే రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం ఎందుక‌నే ఆవేశ‌పూరిత ప్ర‌శ్న‌లు కూడా వేస్తున్నారు. ఏది ఏమైనా తిరుప‌తి ఉప ఎన్నిక‌లు మాత్రం …చేతికి ఖ‌ర్చులు మిగిల్చ డ‌మే త‌ప్ప‌, ఆదాయాన్ని ఇవ్వ‌లేద‌ని ఖ‌చ్చితంగా చెప్పొచ్చు. అందుకే  జ‌గ‌న్ త‌మ క‌డుపు కొట్టార‌ని కొంద‌రి కోపం.

సొదుం ర‌మ‌ణ‌