సాయిపల్లవి హీరోయిన్ గా, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కింది ఫిదా సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఇదే సినిమాలో వరుణ్ తేజ్ స్థానంలో మహేష్ ఉంటే ఎలా ఉంటుంది? కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. కానీ శేఖర్ కమ్ముల మాత్రం అదిరిపోతుందంటున్నాడు.
“ఫిదా స్టోరీ మహేష్ బాబు ఒప్పుకుంటే కచ్చితంగా చేసేవాడ్ని. ఫిదా అనేది లేడీ ఓరియంటెడ్ సినిమానే. నేను ఒప్పుకుంటాను. కానీ మహేష్ ఒప్పుకుంటే కచ్చితంగా దాన్ని మార్చేవాడ్ని. ఆ టాలెంట్ నాలో ఉంది. లేదంటే ఇన్ని రోజులు నేను ఉండను కదా. ఓ సినిమాను కమర్షియల్ గా ఎలా హిట్ చేయాలో నాకు తెలుసు. మహేష్ ఒప్పుకుంటే కచ్చితంగా ఫిదా మరోలా ఉండేది.”
ఫిదా సినిమాను మహేష్ బాబుతో పాటు రామ్ చరణ్ కూడా వినిపించానని చెప్పిన కమ్ముల.. వాళ్లు రిజెక్ట్ చేసిన తర్వాత వరుణ్ తేజ్ అంగీకరించాడని చెప్పుకొచ్చాడు. కానీ మహేష్ చేసుంటే ఆ మూవీ మరో రేంజ్ లో ఉండేదంటున్నాడు.
“ఫిదాలో ఎమోషన్ ఎలా పండించానో అంతా చూశారు. ఓ పొలిటికల్ స్టోరీ లీడర్ లో డ్రామా ఎలా పండించానో అందరూ చూశారు. హ్యాపీడెస్ లో కాలేజ్ లైఫ్ ను ఎలా చూపించానో చూశారు. కాబట్టి మహేష్ బాబు వస్తే ఫిదాను కూడా అలానే కమర్షియల్ గా చూపించేవాడ్ని. కాకపోతే నాతో వచ్చిన సమస్య ఏంటంటే.. నేను కథ చెప్పలేను. నేను స్టోరీ చెబితే హీరోలకు ఆవులింతలు వస్తాయి. కాబట్టి నన్ను నమ్మి ఒప్పుకోవాలి. మిగతా పార్ట్ అంతా నేను చూసుకుంటాను.”
లవ్ స్టోరీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశాడు కమ్ముల. ఆ సినిమా విడుదల మరోసారి వాయిదా పడ్డంతో తన ప్రచారాన్ని ఆపేశాడు.