విశాఖపట్నం కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాళి కట్టించుకున్న భార్యే, భర్త రమేష్ ను హత్య చేసిందనే విషయాన్ని నిర్థారించిన పోలీసులు.. హత్య దృశ్యాల్ని ఆమె తన ఫోన్ లో రికార్డ్ చేసిందనే విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.
ఇంతకీ ఏం జరిగింది..?
రమేష్-శివానీకి పెళ్లయి చాన్నాళ్లయింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓవైపు భర్త, పిల్లలు ఉన్నప్పటికీ, మరోవైపు రామారావు అనే ఆటోడ్రైవర్ కు దగ్గరైంది శివానీ. ఇద్దరూ కలిసి అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నారు. ఈ వివాహేతర సంబంధం రమేష్ కు తెలిసింది. భార్యను గట్టిగా మందలించాడు.
ఈ వ్యవహారంపై గతంలోనే భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పంచాయితీ కూడా జరిగింది అయినప్పటికీ శివానీ మారలేదు. రామరావుతో తన సంబంధాన్ని కొనసాగించింది. ఇది భరించలేని రమేష్ మద్యానికి బానిసయ్యాడు. ఇదే అదనుగా భర్తను హత్య చేసి, రామారావుతో సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకుంది.
అనుకున్నదే తడవుగా నీలా అనే వ్యక్తిని సంప్రదించారు. అతడికి 2 లక్షల రూపాయలు సుపారీ కూడా ఇచ్చారు. ప్లాన్ ప్రకారం, భర్త రమేష్ కు నిద్రమాత్రలిచ్చింది శివానీ. అతడు గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత.. నీలా, రామారావు కలిసి దిండుతో రమేష్ ముఖాన్ని కప్పేసి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని శివానీ పక్కనే ఉండి వీడియో తీసింది.
పోలీసులు వచ్చిన తర్వాత, తనకేం తెలియనట్టు నటించింది శివానీ. కాల్ డేటా, వాట్సాప్ ఛాట్ ఆధారంగా శివానీనే హంతకురాలని గుర్తించారు పోలీసులు. అదే టైమ్ లో వాళ్లకు ఈ వీడియో కూడా కనిపించింది.
భర్తను చంపేసి ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామనుకుంది శివానీ. కానీ అలా చేస్తే జైలులో సెటిల్ అవ్వాల్సి వస్తుందనే విషయాన్ని ఆమె గుర్తించలేకపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.