బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. అక్రమంగా తరలించేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు స్మగ్లర్లు. షర్ట్, షూ, సూట్ కేసు.. ఇలా ఎక్కడా దాచినా కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నారు. దీంతో ఓ స్మగ్లర్ వినూత్నంగా ఆలోచించాడు. బంగారంతో చీర తయారుచేశాడు. తన దుస్తుల్లో కలిపేశాడు. అయినప్పటికీ అధికారులకు దొరికిపోయాడు.
దుబాయ్ నుంచి అర కిలో బంగారాన్ని అక్రమంగా హైదరాబాద్ కు తీసుకురావాలనేది ఇతగాడి ప్లాన్. దీని కోసం అతడు మొత్తం బంగారాన్ని కరిగించాడు. అలా ద్రవరూపంలో మారిన బంగారాన్ని ఓ చీరపై స్ప్రే చేశాడు. శుభ్రంగా మడతపెట్టి తన దుస్తులతో పాటు కలిపేశాడు. బయట నుంచి చూస్తే ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు.
కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యాధునిక నిఘా వ్యవస్థ ఉంది. బంగారాన్ని చీరగా మార్చి అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తుపట్టేశారు. చీరను స్వాధీనం చేసుకున్నారు. ఆ చీరకు కోటింగ్ గా వేసిన బంగారం బరువును 461 గ్రాములుగా, ధరను 28 లక్షల రూపాయలుగా లెక్కకట్టారు.
ప్రస్తుతం సదరు స్మగ్లర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. బంగారాన్ని లిక్విడ్ గా మార్చి, చీరపై స్ప్రే గా కొట్టి, స్మగ్లింగ్ చేసిన అతగాడి తెలివితేటలకు అధికారులు ఆశ్చర్యపోతున్నారు.