కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ తమన్నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోల సినిమాలకు ఆమె ఓకే చెప్పడంతో, కెరీర్ ఇంకాస్త పెరిగింది. ఇందులో భాగంగా ఆమె నటించిన జైలర్, భోళాశంకర్ సినిమాలు 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్నాయి. రెండు పెద్ద సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రావడం అదృష్టంగా భావిస్తోంది తమన్న.
“చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలిసి నటించడంతో నా కల నెరవేరింది. భోళా శంకర్, వేదాళంకు రీమేక్. నా పాత్ర కొత్తగా ఉంటుంది. జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్ లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు. ఆడియోపరంగా జైలర్ లో కావాలయ్య పాట చాలా మందికి రీచ్ అయ్యింది. భోళా శంకర్ లో మాత్రం నాది ఫుల్ లెంగ్త్ రోల్.”
ఇలా రెండు సినిమాల్లో తన పాత్రల తీరుతెన్నుల్ని వివరించింది తమన్న. భోళాశంకర్ విషయానికొస్తే, ఒరిజినల్ సినిమాతో పోలిస్తే తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని చెబుతోంది. తన పాత్రను పూర్తిగా మార్చేసి, నిడివి కూడా పెంచారని అంటోంది. జైలర్ లో తనది ఒరిజినల్ క్యారెక్టర్ అని, కాకపోతే చాలా తక్కువ నిడివి ఉంటుందని చెప్పుకొచ్చింది.
తన కెరీర్ ను ఏదో ఒక పరిశ్రమకు పరిమితం చేయడం ఇష్టం లేదంటోంది తమన్న. ఏటా ప్రతి లాంగ్వేజ్ లో సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నానని వెల్లడించింది. అలాగే సినిమాలతో పాటు ఓటీటీలో కూడా నటిస్తానని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో అరణం అనే సినిమా చేస్తున్న తమన్న… మలయాళంలో బాంద్ర అనే మూవీలో నటిస్తోంది. అలాగే హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలోనే బాలీవుడ్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తానంటోంది.