ఉత్తరాంధ్రాలో ప్రముఖ బీసీ నాయకుడిగా వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు వినిపిస్తుంది. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో విజయాలే ఎక్కువగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో తన పట్టుని ప్రతీ సారీ నిరూపించుకుంటూ వస్తున్న బొత్స టీడీపీకి టార్గెట్గా ఉన్నారు.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో 2024లో టీడీపీ గెలుపు బావుటా ఎగురవేయాలని చూస్తోంది. చీపురుపల్లి ఒకపుడు టీడీపీకి కంచుకోట. 1999 వరకూ వరస విజయాలు ఆ పార్టీకే ఉన్నాయి. గత పాతికేళ్ళుగా పూర్తిగా రాజకీయం మారింది. నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒకే ఒకసారి టీడీపీ గెలిచింది.
బలమైన అభ్యర్ధులు టీడీపీకి ఉన్నా బొత్స దూకుడుని అడ్డుకోలేకపోతున్నారు. ఆయన చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ పదకొండేళ్ల పాటు మంత్రిగా కూడా ఉంటూ వస్తున్నారు. బొత్సను ఢీ కొట్టే మొనగాడు ఎవరు అన్న వెతుకులాటలో టీడీపీ ఉంది అని అంటున్నారు.
మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున చీపురుపల్లి టీడీపీ ఇంచార్జిగా ఉన్నా బొత్సని ఢీ కొట్టే విషయంలో ఇంకా చాలా కావాల్సి ఉందని టీడీపీ అధినాయకత్వం గ్రహించింది అంటున్నారు.
బొత్స ఎత్తులు వ్యూహాలకు ధీటుగా ఎదుర్కొని విజేత కాగల నాయకుడు ఎవరు అన్న సెర్చింగ్ లో టీడీపీ ఉంది అంటున్నారు. కిమిడి నాగార్జునను దూకుడు పెంచాలని అధినాయకత్వం ఆదేశించింది అని అంటున్నారు. బొత్సను ఓడించడం విషయంలో లైట్ తీసుకుంటే చీపురుపల్లి మళ్ళీ దక్కదని ఆ పార్టీలో తర్జన భర్జన సాగుతోంది.
యాంటీ ఇంకెంబెన్సీ, ఎమ్మెల్యే పనితీరు వంటి అంశాలు బొత్స విషయంలో ఏ మాత్రం వర్కౌట్ అవుతాయన్నాది సైతం టీడీపీ ఆలోచిస్తోంది. బొత్సను ఢీ కొట్టే వీరుడు ఎవరో టీడీపీకి దొరుకుతారా అని తమ్ముళ్ళు ఆశగా చూస్తున్నారు.