మూడో సారైనా ఉరి ప‌డుతుందా?

నిర్భ‌య దోషుల‌కు నిర్ణ‌యించిన తేదీ ప్ర‌కారం మూడోసారైనా ఉరి ప‌డుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్ప‌టికి రెండుసార్లు వివిధ కార‌ణాలతో ఉరి వాయిదా ప‌డింది. ముచ్చ‌ట‌గా మూడోసారి నిర్భ‌య దోషుల‌ను మార్చి 3న…

నిర్భ‌య దోషుల‌కు నిర్ణ‌యించిన తేదీ ప్ర‌కారం మూడోసారైనా ఉరి ప‌డుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్ప‌టికి రెండుసార్లు వివిధ కార‌ణాలతో ఉరి వాయిదా ప‌డింది. ముచ్చ‌ట‌గా మూడోసారి నిర్భ‌య దోషుల‌ను మార్చి 3న ఉద‌యం 6 గంట‌ల‌కు ఉరి తీయాల‌ని తిహార్ జైలు అధికారుల‌ను ఢిల్లీ ప‌టియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. న‌లుగురు దోషుల‌కు ఒకేసారి శిక్ష అమ‌లు చేయాల‌ని కూడా ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొంది.

నిర్భయ దోషులకు ఉరి తేదీని ప్రకటించడం ఇది మూడో సారి. దోషుల‌కు కోర్టు ఉరి వేయాల్సిన తేదీని ప్ర‌క‌టించ‌డం, దోషులు చ‌ట్టాన్ని అడ్డు పెట్టుకుని కొత్త‌కొత్త పిటిష‌న్ల‌తో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డంతో…ఉరి వాయిదా ప‌డుతోంది. నిజానికి గ‌త నెల 22వ తేదీనే వారికి ఉరిశిక్ష అమ‌లు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. దోషుల్లో ఒక‌డైన ముఖేశ్ క్ష‌మాభిక్ష పిటిష‌న్ వేయ‌డంతో…మృత్యువు ఫిబ్ర‌వ‌రి 1కి వాయిదా ప‌డింది.

అయితే అంద‌రూ అనుమానించిన‌ట్టుగానే ఈ నెల 1న ఉరితీత వాయిదా ప‌డింది. గ‌త నెల 31న దోషులు మ‌ళ్లీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డంతో, చ‌ట్ట ప‌రిధిలోని అన్ని అంశాల‌ను వినియోగించుకునే వ‌ర‌కు ఉరి వాయిదా వేయాల‌ని కోర్టు పేర్కొంది.  ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని తేల్చి చెప్పింది. శిక్ష అమలుపై స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

నిర్భయ దోషుల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే మార్చి 3వ తేదీని ప్రకటించారు.  కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ దోషుల‌కు మూడోసారి ఉరిశిక్ష అమ‌ల‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  ఉరితీత‌కు ఇదైనా ఆఖరు తేదీ అవుతుందని న‌మ్ముతున్న‌ట్టు ఆమె చెప్పారు. 

పీకే టీమ్ అంటే.. జ‌గ‌న్ కు ఇంత ఆపేక్షా!