అదేంటో జనసేనలో అంతా గందరగోళం. అయోమయం కనిపిస్తోంది. సాలిడ్ గా గెలిచేస్తామనుకుని బరిలో దిగిన చోట దారుణమైన ఫలితాలు చూసిన తరువాత అటు ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇటు లీడర్లు పక్క దారులు వెతుక్కున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి విశాఖ జిల్లాలో జనసేన ఊపు అలా ఇలా కాదు, చాలా మంది నాయకులు వచ్చి చేరారు. దాంతో కచ్చితంగా కొన్ని సీట్లు అయినా ఈ జిల్లా నుంచి గాజు గ్లాస్ పార్టీ పట్టుకెళ్తుందని అంతా భావించారు. చివరి నిముషంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా జై జనసేన అనడంతో విశాఖలో బలంగానే పార్టీ కనిపించింది. పవన్ సైతం పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో టూర్లు వేయడంతో పాటు, తనకు సినీ జీవితాన్ని ఇచ్చిన సిటీ అంటూ వైజాగ్ ని తెగ పొగిడేసారు.
తాను ఇక్కడే నట శిక్షణ పొందానని ఒకటికి పది సార్లు చెప్పుకున్నారు. పవన్ కూడా గాజువాకను ఎంచుకుని ఇక్కడ నుంచే పోటీకి దిగడంతో ఆయన గెలుపు ఖాయమని ఓ దశలో అనిపించింది. అయితే ఫలితాలు దిమ్మదిరిగేలా వచ్చాయి. మొత్తానికి మొత్తం జనసేనకు గుండు సున్నా అయింది. దాంతో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారుకున్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన ఐయారెస్ అధికారి పార్ధసారధి, ఆఖరుకు విశాఖ ఎంపీ అభ్యర్ధి లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై కొట్టేసారు.
మరో వైపు గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య కూడా ఆ పార్టీని వీడిపోయారు. తాజాగా మరో బలమైన నాయకుడు కరణం కనకరావు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరంతా పార్టీ మారిపోతే తాను కూడా ఇటు వైపు చూడడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ పవన్ సైతం గాజువాకకు తలాక్ ఇచ్చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తానని పవన్ తాజాగా చెబుతున్నట్లుగా వస్తున్న వార్తలతో ఆయన గాజువాకను వదిలేసినట్లేనని జనసైనికులు ఒక అంచనాకు వచ్చేశారు. విశాఖ మీద ఏడాది క్రితం వరకూ ప్రేమ ఒలకబోసిన పవన్ కళ్యాణ్ ఇపుడు గాజువాకకు సలాం కొట్టడం పైన ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు.
ఈ ఎన్నిక కాకపోతే వచ్చే ఎన్నికల్లోనైనా పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తారని, తాము గెలిపించుకుంటామని ఆశపడిన వారంతా ఇపుడు నిలువునా నీరు అవుతున్నారు. మరి పవనే విశాఖను పట్టించుకోకపోతే పెద్దగా జనంలో పేరు లేని నేతలు పార్టీని ఇక్కడ ఎలా కాపాడుతారో ఆ దేవుడికే తెలియాలి.