ఓడిపోయి కొట్టుకోవడం వారికే చెల్లు!

సాధారణంగా ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచింది అంటే…  అధికారాన్ని పంచుకునే విషయంలో కీచులాటలు మొదలవుతాయి.  ముఠాలు తలెత్తుతాయి,  వర్గాలు చెలరేగుతాయి,  ఐక్యత అనేది ఎండమావి అవుతుంది.  అయితే ఓడిపోయినప్పుడు మాత్రం సహజంగా అందరూ కలిసికట్టుగా…

సాధారణంగా ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచింది అంటే…  అధికారాన్ని పంచుకునే విషయంలో కీచులాటలు మొదలవుతాయి.  ముఠాలు తలెత్తుతాయి,  వర్గాలు చెలరేగుతాయి,  ఐక్యత అనేది ఎండమావి అవుతుంది.  అయితే ఓడిపోయినప్పుడు మాత్రం సహజంగా అందరూ కలిసికట్టుగా ఉంటారు.  అప్పుడు కూడా ఐక్యత లేకపోతే సాంతం దెబ్బతిని పోతామని భయపడుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ రూటే సపరేటు.  ఓడిపోయినా సరే అక్కడ ముఠాలు కీచు ఆడుకుంటూ ఉంటాయి.  ఢిల్లీ ఎన్నికలే అందుకు ప్రబల నిదర్శనం.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానాలు సాధించి దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  ఫలితాలు వెలువడక ముందే  ఆప్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఉందా?  అనే విషయాల మీద నాయకులు  పరస్పరం విమర్శలు చేసుకున్నారు.  పీసీ చాకో,  పిసిసి చీఫ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.  ఆ తర్వాత దిల్లీ ఓటమి మీదనే…  పీ చిదంబరం,  శర్మిష్ఠ ముఖర్జీ ల మధ్య పరస్పర విమర్శలు చెలరేగాయి.  తాజాగా  అజయ్ మాకెన్,  మిలింద్ దేవరా మధ్య విమర్శలు సాగుతున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని సాధిస్తూ ప్రజల మన్నన గెలుచుకున్నదని,  అందుకే మళ్ళీ విజయం సాధించిందని పార్టీ యువ నాయకుడు మిలింద్ దేవరా ఒక ట్వీట్ చేశారు.  దాంతో సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ కు కోపం వచ్చింది.  కావాలంటే మీరు పార్టీ  వీడి వెళ్ళండి అంటూ విరుచుకుపడ్డారు.  ఆ నాయకుడే గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు ఎదుర్కొందాం అంటూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో అది వర్కౌట్ కాలేదు కానీ… ఇప్పుడు గెలిచిన పార్టీ ని కీర్తించి నందుకు మిలింద్ దేవరా పై ఆయనకు ఆగ్రహం పొడుచుకొచ్చింది.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అందరూ అనుకుంటూ ఉంటారు.  ముఠాలు ఎలా ప్రబలుతూ ఉన్నప్పటికీ…  అధిష్టానం మాత్రం ఉదాసీన వైఖరి చూపిస్తూ ఉంటుంది. వారికి తెలిసిన అంతర్గత ప్రజాస్వామ్యం నిర్వచనం అదే.  అయితే,  ఇప్పుడిలా ఓడిపోయిన తర్వాత కూడా కీచులాడుకుంటూ ఉంటే…  ఢిల్లీలో సీట్లు గెలిచే సత్తా ఎటూ పోయింది…  అంతో ఇంతో పరువు ఉంటే అది కూడా పోతుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

పీకే టీమ్ అంటే.. జ‌గ‌న్ కు ఇంత ఆపేక్షా!