జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని పెద్దలన్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్న యువకులు తమకు కావాల్సిన జీవిత భాగస్వామి గురించి రకరకాలుగా కలలు కంటుంటారు. అలాగే యువతులు కూడా. తమకిష్టమైన వారు ఎలా ఉండాలో తెలియజేస్తూ, అలాంటి వారి కోసం మ్యారేజ్ బ్యూరోలో, వార్తా పత్రికల్లో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుండటం చూస్తున్నాం. కొందరేమో వితంతువులైనా ఫర్వాలేదని, మరికొందరేమో పిల్లలున్నా ఇబ్బంది లేదని, మరికొందరేమో ఆర్థికంగా స్థితి మంతులై ఉండాలని….ఇలా రకరకాల ప్రకటనలు చదువుతూ ఉంటాం.
మరీ ముఖ్యంగా ఆదివారమైతే చాలు వార్తా పత్రికల నిండా కుల, మత, వితంతు, డైవర్సీ…తదితర వర్గాలకు చెందిన యువతీ యువకులు, మధ్య వయస్కులు తోడు కోసం ఇచ్చిన ప్రకటనలే నాలుగు ముక్కల్లో రాసిన వివరాలు కనిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్‌లోని బ్రాహ్మణ కులానికి చెందిన డాక్టర్ అభినవ్‌కుమార్ అనే యువకుడు కాస్త విభిన్నంగా తాను కోరుకుంటున్న వధువుకు ఉండాల్సిన లక్షణాలను వెల్లడించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తన జీవిత భాగస్వామి కావాలనుకున్న యువతి అందంగా, నమ్మకమైన బ్రాహ్మణ వధువై ఉండాలని ఫస్ట్ కండీషన్ చెప్పాడు. అంతేకాదండోయ్…అతివాద లక్షణాలున్నా అభ్యంతరం లేదని తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇంకా అతని నియమ నిబంధనల్లో చాలా అంశాలే ఉన్నాయి. ధనవంతురాలు, దేశభక్తురాలై ఉండాలని కూడా షరతు విధించాడు.
‘ఆమెకు మనదేశ సైనిక, క్రీడా సామర్థ్యాలను పెంచాలన్న కోరిక ఉండాలి. వంట కూడా బాగా వచ్చి ఉండాలి. ఉద్యోగం చేస్తుండాలి ' అని డిమాండ్లు పెట్టాడు. ఇంకో ముఖ్యమైన డిమాండ్‌ను కూడా అతను చివరిగా వెలిబుచ్చాడు. అదేంటంటే… ‘పిల్లను పెంచడంలో నైపుణ్యం ఉండాలి' అని కూడా ప్రకటించాడు.
సదరు యువ డాక్టర్ గారి ప్రకటనపై నెటిజన్లు భలే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘ఇంకా నయం పెళ్లయినా ఫర్వాలేదని ఓ నిబంధన పెట్టకపోయావా ' అని ట్రోల్ చేశారు. అలాగే ఇన్ని గుణాలున్న యువతి అసలు భూమి మీద ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.