కొంచెం ఆలస్యంగా అయినా సరే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టం మీద స్పందించారు. సీఏఏను రద్దు చేయాల్సిందే అంటూ హూంకరించారు. ఈ డిమాండ్ తో తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు. ఒకవేళ కేంద్రం దిగిరాకుంటే గనుక.. హైదరాబాదులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా సంకల్పించారు. సరిగ్గా వారణాశి పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ.. సీఏఏపై ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేనేలేదని ప్రకటించిన నాడే.. ఇక్కడ హైదరాబాదులో ఆ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ కేబినెట్ తీర్మానించడం విశేషం.
ఇలాంటి నేపథ్యంలో సీఏఏ మీద అసలు కేసీఆర్ గర్జనలకు విలువ ఉన్నదా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ.. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్నవన్నీ ఎన్డీయే వ్యతిరేక ప్రభుత్వాలే. ఆ క్రమంలో ఇప్పుడు తెలంగాణ శాసనసభ కూడా ఒక తీర్మానం చేస్తుంది. అయితే దీనివల్ల ఏం ఫలితం ఉంది!
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల ఓటు బ్యాంకు ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇక్కడ అధికారం కోరుకునే ఏ పార్టీ కూడా ముస్లిం ఓటు బ్యాంకును దూరం చేసుకోదు! కేసీఆర్ మాటలు కూడా కేవలం ఆ క్రమంలో ఒక ప్రయత్నం మాత్రమేనా? లేదా, చిత్తశుద్ధితో సీఏఏకు వ్యతిరేకంగా తాను గళం వినిపించదలచుకున్నారా? అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. సీఏఏ చట్టంలో ఉన్న లొసుగులకు వ్యతిరేకంగా గళమెత్తదలచుకుంటే గనుక.. ఇప్నటికే చాలా ఆలస్యం చేసినట్టు లెక్క!
కేవలం శాసనసభ తీర్మానంచేసి పంపినా కేంద్రం దానిని ఏమాత్రమూ పట్టించుకోదు. మెజారిటీ రాష్ట్రాలు కమలదళం చేతుల్లో ఉన్నాయి. ఆ తర్వాత.. కేసీఆర్ మహా అయితే ఓ బహిరంగ సభ పెట్టగలరు. తన అసామాన్యమైన వాగ్ధాటితో తెలుగుఉర్దూ కలగలిపి ముస్లింలను ఆకట్టుకోగలరు. కానీ ఫలితం ఏమిటి?
గతంలో జాతీయ స్థాయిలో మూడోకూటమిగా పార్టీలను ఏకం చేయడానికి కేసీఆర్ ప్రయత్నించినట్లే.. సీఏఏ మీద కూడా గట్టి ప్రయత్నం చేయడానికి ఆయన పూనికవహిస్తే.. శ్రద్ధను ప్రజలు నమ్ముతారు. నిజంగానే సీఏఏకు వ్యతిరేకంగా నడుం బిగించినట్లు అనుకుంటారు. క్రియాశీల కార్యాచరణ లేకుండా.. తీర్మానాలు సభలు అయితే రాజకీయ మైలేజీ తప్ప మరేం జరగదు.