ఇన్ని రోజులు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై బీజేపీ ఈడీని ప్రయోగిస్తుందంటూ ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలను నిజం చేకూరుస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మీనాక్షి లేఖి విపక్ష సభ్యులను ఉద్దేశిస్తూ పార్లమెంట్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విపక్ష నేతలు సైలెంట్‌గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ వస్తుంది’ అని మీనాక్షి లేఖి హెచ్చరించారు.
ఇవాళ లోక్‌సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మంత్రి మీనాక్షి లేఖి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నిమిషం మీరు నా మాటలు వినాలని, శాంతంగా ఉండాలని, లేదంటే ఈడీ మీ ఇంటికి వస్తుందని మంత్రి మీనాక్షి హెచ్చరించారు. దీంతో వారు కంగుతిన్నారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పిన మాటలు ఇప్పుడు రుజువయ్యాయని దుయ్యబట్టారు. కాగా గత కొంత కాలంగా ఏ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన ఆ రాష్ట్రంలో బీజేపీ అధినాయకత్వం కంటే ముందుగా ఈడీ, సీబీఐలు వస్తాయంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్న విషయం తెలిసిందే.