బ్రో సినిమా వివాదంపై పరోక్షంగా స్పందించిన పవన్

బ్రో సినిమాలో తనను అనుకరించిన విధానంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా బ్రో సినిమా ద్వారా పవన్ కు చంద్రబాబు ప్యాకేజీ అందించారని ఆయన ఆరోపించారు.…

బ్రో సినిమాలో తనను అనుకరించిన విధానంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా బ్రో సినిమా ద్వారా పవన్ కు చంద్రబాబు ప్యాకేజీ అందించారని ఆయన ఆరోపించారు. దమ్ముంటే పవన్ తన రెమ్యూనరేషన్ ఎంతో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై పవన్ కల్యాణ్ పరోక్షంగా స్పందించారు. బ్రో సినిమాను తను వదిలేశానని, కానీ కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఇంకా ఆ సినిమాను పట్టుకొని వదలడం లేదంటూ స్పందించారు. బ్రో సినిమా ద్వారా వివాదం రేపి, ఆ ఉచ్చులోకి జనసేన నాయకుల్ని లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

“బ్రో సినిమాను నేను ఎప్పుడో వదిలేశాను. షూట్ చేశాను, డబ్ చేశాను, ఫంక్షన్ కు హాజరైన తర్వాత వదిలేశాను. వైసీపీ నాయకులు మాత్రం ఇంకా వదల్లేదు. జనసేన నేతలు ఆ ఉచ్చులో పడొద్దు. నా ఇష్యూ బ్రో మూవీ కాదు. బ్రో సినిమాకు సంబంధించి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల ఉచ్చులో మీరు (జనసైనికులు) పడొద్దు. వాళ్లు బ్రో సినిమా గురించి ఆరోపణలు చేస్తే, మీరు అసలైన సమస్యలపై వాళ్లను నిలదీయండి.”

ఈ సందర్భంగా సినిమాలపై, తన ఆస్తులపై స్పందించారు పవన్ కల్యాణ్. కేవలం డబ్బు కోసం మాత్రమే తను సినిమాలు చేస్తున్నానని, తనకు అది అవసరం అని అన్నారు. అలా సినిమాలు చేస్తూ తను సంపాదించుకున్నది ఏం లేదని కూడా అంటున్నారు.

“సినిమా నాకు అవసరం. పార్టీని నడపడానికి నాకు ఇంధనం సినిమా. ఆ ఇంధనాన్ని నేను పార్టీ కోసం, ప్రజల కోసం పెడుతున్నాను. అంతేతప్ప, సినిమాపై నాకు ప్రేమ ఎక్కువ ఉండదు, అలా అని తక్కువ ఉండదు. దయచేసి జనసేన నాయకులెవ్వరూ సినిమాని రాజకీయాల్లోకి తీసుకురావొద్దు. జనసేన పార్టీ ఆఫీస్ లో వెనక ఉండే చిన్న రూమ్ లో ఉంటాను. నాకు ఆస్తుల్లేవు. నా సొత్తు ఏంటంటే, 5-6 బీరువాల పుస్తకాలు, 2-3 బ్యాగుల బట్టలు, మరో బ్యాగులో నాకు కావాల్సిన వస్తువులు.. ఇదే నా సొత్తు.”

తన సొత్తుతో, మంగళగిరికి పూర్తిగా షిఫ్ట్ అయిపోయానని ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇకపై తను మంగళగిరిలోనే ఉంటానని, అందరికీ అందుబాటులోనే ఉంటానని అన్నారు.