తను ఎన్నో సినిమాలు చూశానని, ఎన్నో జానర్లు టచ్ చేశానని, కానీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సృష్టిస్తున్న ఈ మిస్టరీ తనకు బొత్తిగా అర్థం కావడం లేదన్నారు పోసాని. తను ఓడిపోయినా, తన అన్న ఓడిపోయినా, తన కాపు వర్గీయులు ఓడిపోయినా పర్వాలేదని.. చంద్రబాబు మాత్రం గెలిస్తే చాలని పవన్ అనుకుంటున్నాడని, ఆ మిస్టరీ ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు.
“మా అన్నయ్య ఓడినా పర్వాలేదు, కాపులు ఓడినా పర్వాలేదు, మా కమ్మోడు గెలవాలి, చంద్రబాబు గెలవాలి అంటున్నావు. ఇదేం మిస్టరీనో నాకు అర్థం కావడం లేదు. పవన్ లాంటి నాయకుడు దొరకడం కాపుల ఖర్మ. తమకు ఎలాంటి నాయకుడు దొరికాడో కాపులే తమనుతామ ప్రశ్నించుకోవాలి. పదవి వద్దంటావ్, అధికారం వద్దంటావ్, చంద్రబాబును సీఎంను చేయమంటావ్. ఇదేం మిస్టరీ పవన్, నాకు అర్థం కావడం లేదు.”
గతంలో చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టిన పవన్ కల్యాణ్.. ఐదేళ్లు తిరిగేసరికి తిరిగి మళ్లీ వాళ్లకే ఓట్లేసి గెలిపించమని అడుగుతున్నారు. ఈ మిస్టరీ ఏంటో తనకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదంటున్నారు పోసాని.
“చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతి అని నువ్వే చెప్పావ్, మరి ఎందుకు మళ్లీ చంద్రబాబు దగ్గరకెళ్లావ్? లోకేష్ తెగ తింటున్నాడు, అవినీతి చేస్తున్నాడని అన్నావ్, పైనున్న ఎన్టీఆర్ ఏడుస్తుంటాడని అన్నావ్. మళ్లీ లోకేష్ దగ్గరకు చేరావు. జనసేన మద్దతు లేకుండా చంద్రబాబు గెలవలేడని నువ్వే అన్నావ్. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్లకు ఓట్లు వేయరని అన్నావు. మరి ఎందుకు ఆయన వెంట పడుతున్నావు. ఈ మిస్టరీ ఏంటో నాకు అర్థంకావడం లేదు.”
ఇలాంటి మిస్టరీ రాజకీయాలు చేసే పవన్ లాంటి రాజకీయ నాయకుడ్ని, దేశంలో తను ఎక్కడా చూడలేదన్నారు పోసాని. కాపులు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, వాళ్లపై గతంలో సినిమా కూడా తీశానని గుర్తుచేసిన పోసాని.. పవన్ లాంటి నాయకుడ్ని కలిగి ఉన్నందుకు కాపులంతా సిగ్గుపడాలన్నారు.