గూఢచారి 2 సినిమా స్క్రిప్ట్ పనిలో వుంటే.. గూఢచారి లెక్కలు తేలలేదంటూ ఆ సినిమా భాగస్వాముల మధ్య పంచాయతీ మొదలైంది. అడవిశేష్ గూఢచారిలో చాలా మంది భాగస్వాములు వున్నారు. అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా, పీపుల్స్ మీడియా, అనిల్ సుంకర ఇలా… సినిమా నిర్మాణం అన్నీ అనిల్ సుంకర చేసారు. భాగస్వాములు ఎందరున్నా నిర్మాణ బాధ్యత ఎవరో ఒకరే చేస్తారు. ఈ సినిమా లెక్కలు ఇప్పటి వరకు అనిల్ సుంకర తేల్చలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు పంచాయతీ మొదలైంది.
అందరూ కలిసి సునీల్ నారంగ్ వద్ద పంచాయతీకి కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా భాగస్వాముల్లో ఒకరైన అభిషేక్ నామా దీని మీద నిర్మాతల మండలికో, కౌన్సిల్ కో లెటర్ పెట్టినట్లు తెలుస్తోంది. తనకు రావాల్సిన వాటా తనకు ఇవ్వలేదన్నది ఆ ఫిర్యాదు సారాంశమని తెలుస్తోంది.
భోళాశంకర్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా నిర్మాత అనిల్ సుంకర నే. ఇలాంటి టైమ్ లో ఈ పంచాయతీ మొదలైంది. సాధారణంగా ఇలాంటి క్రూషియల్ టైమ్ లోనే పాత లెక్కలు, పాత గొడవలు బయటకు వస్తాయి. అప్పుడైతేనే వేడి పెర్ ఫెక్ట్ గా అందుకుంటుందని భావిస్తారు.
ఏజెంట్ గొడవ కోర్టుకు
ఇదిలా వుంటే ఏజెంట్ సినిమాను హోల్ సేల్ గా కొన్న బయ్యర్ సతీష్ (వైజాగ్) హైకోర్టులో కేసు వేసారు. ఈ సినిమా హక్కులు 30 కోట్లకు కొని తాను దారుణంగా నష్టపోయానని, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఇందుకు గాను కోర్టు ఫీజునే ముఫై లక్షలకు పైగా కట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసు సోమవారం విచారణ కు వస్తోంది. ఏజెంట్ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర నే.
సినిమా విడుదల అయిన దగ్గర నుంచి నిర్మాత అనిల్ సుంకర అస్సలు తనతో మాట్లాడడమే లేదని, కలడానికి ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వడమే లేదన్నది సతీష్ ఆవేదన. అయితే సతీష్ కోర్టులో కేసు వేసారు తప్ప భోళాశంకర్ విడుదల మీద స్టే ఇవ్వమని అడగలేదు. అందువల్ల అనిల్ సుంకరకు ఏ టెన్షన్ లేదు.