సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదట ఆయన రాయలసీమ నుంచే పర్యటన మొదలు పెట్టారు. వైఎస్సార్ జిల్లాలో ఆయన గండికోట, చిత్రావతి రిజర్వాయర్లను సందర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు తీవ్రస్థాయిలో తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.
పనిలో పనిగా వైఎస్ కుటుంబ ఆడబిడ్డలు డాక్టర్ సునీత, వైఎస్ షర్మిలపై సానుభూతి ప్రదర్శించారు. జగన్‌ను సీమ ద్రోహిగా చిత్రీకరించారు. పులివెందులలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభిమానం చూపారంటూ, ప్రత్యేకంగా ట్విటర్ వేదికగా వారికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కడప జిల్లా బిడ్డగా తన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. మోసగాడి మనసును అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కడపను కౌగిలించుకునేందుకు ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) వచ్చాడని విమర్శించారు. మన మీద ప్రేమలేదన్నారు. కడపపై వల్లమాలిన ప్రేమ ప్రదర్శిస్తావా? అని రాచమల్లు ప్రశ్నించారు. పులివెందులలో ఉండిపోవాలని అనిపిస్తోందని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఎలా వుండిపోవాలని అనిపిస్తోంది పెద్ద మనిషికి నీకు, రాక్షసుల మధ్యనా? అని ఆయన ప్రశ్నించారు.
తమను రాక్షసులని అన్నావు కదా? అని ఆయన నిలదీశారు. కడప గూండాలన్నావని గుర్తు చేశారు. గూండాలు, రౌడీలు, రాక్షసులని నీచంగా మాట్లాడి, ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావని విరుచుకుపడ్డారు. నీ కపట ప్రేమ ఎవరికి తెలియదని ఆయన ప్రశ్నించారు. కడప ప్రజలపై ప్రేమ లేని పెద్ద మనిషికి, రాజశేఖరరెడ్డి బిడ్డలపై ప్రేమ ఉందట అని వెటకరించారు.
షర్మిలమ్మ మీద అభిమానమట, సునీతమ్మపై ఏమంత ప్రేమ? అని ప్రశ్నించారు. సునీతమ్మ అనే అమాయక చేపను వలవేసి బంధించావని మండిపడ్డారు. రేపు సునీతమ్మను రాజకీయంగా పావుగా వాడుకుంటావని చెప్పారు.