పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం విశేషం. మోదీ ఇంటి పేరుపై ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన ఘాటు విమర్శలు … చివరికి ఆయన ఎంపీ పదవికి ఎసరు తెచ్చాయి.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్నాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ “దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని ఘాటు విమర్శ చేశారు. ఈ విమర్శతో పరువు నష్టం వాటిల్లిందని బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ న్యాయ పోరాటానికి దిగారు. సూరత్‌లోని కోర్టు క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది.
రాహుల్‌కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ లోపు రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. కర్నాటక ఎన్నికల్లో కూడా రాహుల్‌పై అనర్హత వేటు బీజేపీని రాజకీయంగా దెబ్బతీసిందనే అభిప్రాయం వుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ కింది కోర్టుల ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలన్న రాహుల్‌గాంధీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. స్టే విధిస్తూ సుప్రీం కీలక ఆదేశాలు వెల్లడించింది. గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కింది కోర్టులు పత్రాల సంఖ్య చూశాయే తప్ప, పరువు నష్టం కేసులో సరైన కారణాలు చూపలేదని ఘాటు వ్యాఖ్య చేసింది.