తెలంగాణ గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య గొడవ మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల కాలంలో గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య కొంత సుహృద్భావ వాతావరణం ఉన్నట్టుగా కనిపించింది. అయితే అలాంటిదేమీ లేదని గవర్నర్ తన చర్యలు ద్వారా నిరూపించుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండా మోకాలడ్డుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ సర్కార్‌ను కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇటీవల కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ బిల్లును రూపొందించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదానికి బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. రెండు రోజులుగా బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజ్‌భవన్ భిన్నంగా వుంది. అసలు ఆ బిల్లు తమకు రాలేదని చెప్పడం గమనార్హం.
అసెంబ్లీ సెషన్ ముగిసేలోపు గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. కేసీఆర్ సర్కార్‌పై కోపంతో బిల్లును నిర్ణీత గడువు లోపు పంపకపోతే, కార్మికులకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.