మార్గ‌ద‌ర్శి కేసులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు చుక్కెదురు!

మార్గ‌ద‌ర్శి కేసులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుకున్న‌ట్టుగా ముందుకు సాగ‌లేక‌పోతోంది. మార్గ‌ద‌ర్శిని ఏదో చేయాల‌నే త‌ప‌న త‌ప్ప‌, ఆచర‌ణ‌లో ప్ర‌భుత్వానికి నిరాశ త‌ప్ప‌డం లేదు. న్యాయ స్థానంలో వైసీపీ ప్ర‌భుత్వానికి అడుగ‌డుగునా వ్య‌తిరేక ఫ‌లితాలే. దీంతో…

మార్గ‌ద‌ర్శి కేసులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుకున్న‌ట్టుగా ముందుకు సాగ‌లేక‌పోతోంది. మార్గ‌ద‌ర్శిని ఏదో చేయాల‌నే త‌ప‌న త‌ప్ప‌, ఆచర‌ణ‌లో ప్ర‌భుత్వానికి నిరాశ త‌ప్ప‌డం లేదు. న్యాయ స్థానంలో వైసీపీ ప్ర‌భుత్వానికి అడుగ‌డుగునా వ్య‌తిరేక ఫ‌లితాలే. దీంతో న్యాయ‌స్థానంలో చీవాట్లు త‌ప్ప‌, అనుకున్న‌ది సాధించ‌లేక‌పోతోంద‌న్న‌ది వాస్త‌వం.

తాజాగా మ‌రోసారి సుప్రీంకోర్టులో వైసీపీ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసుల బ‌దిలీ చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వంపై వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చింది. అలా బ‌దిలీ చేయ‌డానికి కుద‌ర‌ద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మార్గ‌ద‌ర్శి కేసుల‌ను విచారించే న్యాయ ప‌రిధి తెలంగాణ హైకోర్టుకు లేద‌నే ఏపీ వాద‌న‌తో సుప్రీంకోర్టు ఏకీభ‌వించ‌లేదు. దీంతో ఏపీ ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.

తెలంగాణ హైకోర్టులోనే న్యాయపరిధి అంశాన్ని తేల్చుకోవాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే మార్గ‌ద‌ర్శిపై విచార‌ణ జ‌రిగిన కార‌ణంగా, మ‌ళ్లీ విచార‌ణ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. అలాగే మార్గ‌ద‌ర్శి చైర్మ‌న్ రామోజీరావు, ఎండీ శైల‌జాకిర‌ణ్‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది.  

మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.