మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొరకరాని కొయ్యగా మారారు. ప్రతిచోట చంద్ర బాబుకు అడ్డు తగులుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి భుజాలపై జగన్ పెట్టారు. అందుకే పదేపదే కుప్పంలో పెద్దిరెడ్డి పర్యటిస్తూ, టీడీపీ శ్రేణుల్ని వైసీపీ వైపు తిప్పుకునేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్డా పులివెందులలో వైసీపీ శ్రేణులు చేయలేని పనిని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చేయడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబు రాకను నిరిసిస్తూ పుంగనూరులో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ శ్రేణులు నినదించాయి. నల్ల జెండాలతో వైసీపీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనార్థం చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు ఇవాళ వెళ్లారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో హంద్రీ-నీవా కాలువ పనులను చంద్రబాబు పరిశీలించిన అనంతరం పుంగనూరు బైపాస్ మీదుగా చిత్తూరు చేరుకోనున్నారు.
చంద్రబాబు బైపాస్ మీద వెళుతుండడాన్ని కూడా పెద్దిరెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల చంద్రబాబు పులివెందులకు వెళ్లారు. అక్కడ ఆయన పర్యటన ప్రశాంతంగా సాగింది. ఏ ఒక్కరూ ఆయన పర్యటనను నిరసించలేదు. రోడ్ల మీదకి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ పుంగనూరు బైపాస్ మీద వెళుతున్న చంద్రబాబు పర్యటనకు నిరసనగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించడం గమనార్హం.
ఎస్వీయూలో విద్యార్థి నాయకులుగా చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య వైరం వుంది. అది రాజకీయాల్లో కూడా కొనసాగుతోంది. సీఎం జగన్ నియోజకవర్గంలో కూడా ఎదురుకాని ఇబ్బందులు, పెద్దిరెడ్డి అడ్డాలో కనిపించడం చంద్రబాబు జీర్ణించుకోలేని సంగతే.