సినిమా వంటకాలు అంటే అంత సులువుగా సాధ్యంకాదు. అందునా డైరక్టర్ వీక్ అయితే ఎవరయినా చేయి వేస్తారు. నిర్మాత ఎవరి చేయి అయినా వేయిస్తారు. రెండు యావరేజ్ సినిమాలు అందించాడు దర్శకుడు శ్రీరామ్ ఆధిత్య. అలాంటిది నాని-నాగ్ లను డైరక్ట్ చేసే పెద్ద సినిమా చాన్స్ వచ్చింది. అప్పుడే అనుమానపడ్డారు. ఏమిటి విషయం అని.
అవతల వున్నది కాకలు తీరిపోయిన ప్రొడ్యూసర్ అశ్వనీదత్. ఇంక చెప్పేదేముంది. సినిమా కథ తయారుచేయడానికి చాలామంది రచయితలను పురమాయించారట. మూలకథను రాఘవ శ్రీరామ్ ఇస్తే, భూపతిరాజా సినిమా కథగా మార్చారట. భూపతిరాజా సినిమా కథలు ఫార్ములాకు కట్టుబడి వుంటాయన్నది తెలిసిందే. ఆపైన సత్యనంద్ జాయిన్ అయ్యారట.
ఈ మధ్య కథలను రిపేర్ చేయడం అన్నది ఈయన చురుగ్గా చేస్తున్నారు. వీళ్లంతా చాలదన్నట్లు సినిమాలో ఎమోషన్లు పండించాలని బుర్రా సాయిమాధవ్ ను రంగంలోకి దించారట. వీళ్లంతా కలిసి వండిన కథ మాటలకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య స్క్రీన్ ప్లే తయారుచేసారట. అయినా ఇంతమంది చేయివేసాక, శ్రీరామ్ ఆదిత్య చేయడానికి ఏం మిగిలినట్లో?