బిగ్ హౌస్‌లో ఏకాకిగా మారిపోయాడు కౌశల్. దానికి కారణాలు ఏవైనాగానీ, షోలో ప్రతిరోజూ జరుగుతున్న పరిణామాలు కౌశల్ మీద విపరీతమైన సింపతీని క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కౌశల్ పేరు మార్మోగిపోతోంది. నిన్న దుబాయ్‌లో భారత్ – హాంగ్‌కాంగ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే, ఆ మైదానంలో కూడా 'కౌశల్' పేరుతో జెండా ఎగరేసేశారు. ఇలా 'కౌశల్ ఆర్మీ', కౌశల్ కోసం చాలా కష్టపడ్తోందన్నది నిర్వివాదాంశం.
రోజులో 24 గంటలు.. ఆ ఇరవై నాలుగ్గంటల్లో గట్టిగా గంటన్నర సమయం మాత్రమే షో ప్రసారమవుతోంది. 'అవసరమైన కంటెంట్' మాత్రమే తీసుకుంటూ, దానికి మసాలా జోడిస్తోంది 'బిగ్ బాస్' టీమ్. ఏ షో అయినా ఇలాగే చేస్తుందనుకోండి.. అది వేరే విషయం. అయితే, సీజన్ వన్‌తో పోల్చితే, రెండో సీజన్ అస్సలేమాత్రం అర్థంపర్థం లేకుండా సాగుతుండడంతో ఈ షో రోజురోజుకీ డల్ అయిపోతోంది. డల్ అయిపోతోన్న షోని రక్తి కట్టించేందుకు, చేస్తున్న 'సిల్లీ' ప్రయత్నాలూ బెడిసికొట్టేస్తున్నాయి.
హౌస్‌లో కౌశల్, తనీష్ మధ్య మాటల యుద్ధం ఓ దశలో కొట్టుకునేదాకా వెళ్ళింది. అయితే, ఆ తర్వాత వివాదం సద్దుమణిగినట్లే కన్పించిందనుకోండి.. అది వేరే విషయం. 'ఇలాగే భౌతిక దాడులు కొనసాగితే, ఇద్దర్నీ హౌస్ నుంచి పంపించేయాల్సి వుంటుంది..' అని బిగ్ బాస్ హెచ్చరించాడుగానీ, ఆ చెత్త టాస్క్‌లు ప్రిపేర్ చేసేటప్పుడే.. కాస్తంత ఆలోచన ఆ బిగ్‌బాస్‌కి వుండి వుండాలి. హౌస్‌లో అందరూ కలిసి కౌశల్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఆటోమేటిక్‌గా ఈ విషయమై కౌశల్‌లో అసహనం పెరిగిపోతుంది. అదే జరుగుతోంది కూడా.!
'కుక్కల్లా మీద పడిపోతున్నారు..' అంటూ కౌశల్ సహనం కోల్పోవడాన్ని హైలైట్ చేస్తూ, ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇకనేం, తనీష్ కావొచ్చు, సామ్రాట్ కావొచ్చు.. మిగతా హౌస్ మేట్స్ కావొచ్చు, కౌశల్‌పై మరింతగా రెచ్చిపోవడం ఖాయమే. నిన్నటి భౌతిక దాడుల వ్యవహారమే ఈరోజు షోలో రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కౌశల్‌ని ఈ కారణం చూపి బయటకు పంపేందుకు రంగం సిద్ధమయ్యిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటికే కౌశల్ ఆర్మీ, బిగ్ బాస్ హోస్ట్ నానితోపాటు, బిగ్ బాస్ షో ప్రసారమవుతున్న 'స్టార్ మా' ఛానల్‌కి కూడా అల్టిమేటం ఇచ్చింది. కౌశల్, తనంతట తానుగా షో నుంచి బయటకు వచ్చినా (సెల్ఫ్ ఎలిమినేట్), షో నుంచి బయటకు బలవంతంగా పంపబడినా.. ఆ తర్వాతి పరిస్థితులు ఎలా వుంటాయో ఏమో.!