2.0 కథ ఇదే..! వైరల్ అవుతున్న స్టోరీ..?

రోబోను తయారు చేసి, దానికో మనసుంటే, అది మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెరకెక్కించి చివరికి అది చేసే వినాశనాన్ని తట్టుకోలేక దాన్ని నాశనం చేసే కథాంశంతో తెరకెక్కిన సినిమా రోబో. దీనికి సీక్వెల్…

రోబోను తయారు చేసి, దానికో మనసుంటే, అది మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెరకెక్కించి చివరికి అది చేసే వినాశనాన్ని తట్టుకోలేక దాన్ని నాశనం చేసే కథాంశంతో తెరకెక్కిన సినిమా రోబో. దీనికి సీక్వెల్ ఉంటే ఎలా ఉంటుందనే ఊహ కూడా ఎవరికీ వచ్చి ఉండదు. ఎందుకంటే రోబోలోనే అన్నికోణాలూ చూపించేశాడు దర్శకుడు శంకర్. 

ఇక రోబో సీక్వెల్ విషయానికొస్తే దీని కథ ఎక్కడా లీక్ కాలేదు. రోబో క్లైమాక్స్ లో విలన్ గా మారిన చిట్టి సీక్వెల్ కి వచ్చేసరికి మళ్లీ హీరోగా మారుతున్నాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పక్షి పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ట్రైలర్ లో కూడా ఇంతవరకే చూపించారు. అయితే సెల్ ఫోన్లు మాయం అనే కాన్సెప్ట్ మాత్రం కాస్త కొత్తగా తోచింది. పక్షిరాజు, సెల్ ఫోన్లు, చిట్టి మధ్య గమ్మత్తుగా అల్లిన కథ ఇది. 

ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం, ఇబ్బడిముబ్బడిగా సెల్ టవర్లు నిర్మించడం, ఈ రేడియేషన్ వల్ల కలిగే విపరీతాలు, నష్టాలే కథాంశంగా 2.0 సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు శంకర్. తమ సంతతిని తగ్గించేస్తున్న మానవజాతిపై పగతీర్చుకోడానికి పక్షులన్నీ ఒకటవుతాయి.

పక్షిరాజు అక్షయ్ నాయకత్వంలో పోరాటానికి దిగుతాయి. ఈ అనర్థాన్ని అరికట్టడానికి హీరో రజనీకాంత్ తాను నాశనం చేసిన చిట్టిని తిరిగి బయటకి తీసుకొస్తాడు. దానికి కొత్త శక్తులు ఇచ్చి పక్షిరాజుతో యుద్ధం చేయిస్తాడు.

ఇక క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది, మానవులపై పక్షులది పైచేయిగా మిగులుతుందా. పక్షిజాతిని రోబో సాయంతో మానవులు కట్టడిచేస్తారా అనేది తేల్చేస్తాడు శంకర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథ నిజమో కాదో తేలాలంటే రోబో 2.0 విడుదల వరకూ వేచి చూడాల్సిందే.