టీవీ డిబేట్లలో ఇటీవల చెడు ధోరణులు పెరుగుతున్నాయి. పరస్పర ఆవేశకావేశాలకు పోతున్నారు. సహజంగా రెండు పార్టీల నేతల మధ్య పరస్పర దూషణలు చూస్తుంటాం. కానీ TV5 చర్చలో యాంకర్ మూర్తి, బీజేపీ అధికార ప్రతినిధి దినకర్ మధ్య తీవ్రస్థాయిలో తిట్ల వర్షం కురిసింది. ఒక దశలో ఇద్దరు కొట్టుకుంటారేమో అనేంతగా రచ్చ చోటు చేసుకొంది.
విశ్వసనీయ సమాచారం మేరకు డిబేట్ అనంతరం కూడా వారిద్దరి మధ్య TV5 కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాదు కార్యాలయం అనే విషయం మరిచి వారిద్దరూ బూతులు తిట్టుకున్నారని తెలిసింది. చివరికి వాళ్లిద్దరూ కార్యాలయంలో బాహాబాహీకి దిగేందుకు సిద్ధపడిన తరుణంలో తోటి ఉద్యోగులు సర్ది చెప్పారని తెలిసింది. అసలేం జరిగిందంటే…
TV5లో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు రాజధాని అమరావతిపై చర్చ పెట్టారు. ఈ డిబేట్‌కు యాంకర్‌గా మూర్తి వ్యవహరించగా చర్చలో హైదరాబాద్ స్టూడియో నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, తిరుపతి నుంచి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, మరోచోట నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.
చర్చ కొంతసేపటి వరకు కూల్‌గానే సాగింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తప్పు పట్టాడు. చట్టం, రాజ్యం గురించి మాట్లాడుతున్న బీజేపీ…విభజన చట్టంలో ఏపీకి రూ.5 లక్షల కోట్ల లబ్ధి కలిగేలా చేశారని, దాన్ని ఫాలో కావాలని అడిగాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక విభజన చట్టాన్ని ఎంత మాత్రం అమలు చేశారు, ఇప్పటి వరకు చేసిందెంత అని సూటిగా ప్రశ్నించాడు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా బీజేపీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని జీవీ రెడ్డి సుతిమెత్తగా ఘాటైన విమర్శలు చేశాడు. ఇలా బీజేపీ అనేక సందర్భాల్లో పాల్పడుతున్న అప్రజాస్వామిక విధానాలను ఆయన తూర్పారపట్టాడు.
జీవీరెడ్డి మాటలను బీజేపీ నేత దినకర్ అడ్డుకున్నారు. సహజంగా వయసు రీత్యా చిన్నవాడైన జీవీరెడ్డి చాలా పెద్దరికంగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. దినకర్ మాట్లాడటం మొదలు పెట్టాక, అతను వింటూ కూర్చున్నాడు. కానీ యాంకర్ మూర్తి తాను చెప్పేది వినాలంటూ ఒకటికి మూడునాలుగు సార్లు కోరాడు. కానీ దినకర్ వినిపించుకోలేదు. బీజేపీపై విమర్శలను ఉద్దేశపూర్వకంగానే చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలా యాంకర్ మూర్తి, దినకర్ మధ్య మాటా మాటా పెరిగింది.
చినికి చినికి గాలివానగా మారిన చందంగా మూర్తి, దినకర్ తాము లైవ్‌లో ఉన్నామనే కనీస స్పృహ కూడా లేకుండా తిట్ల దండకానికి దిగారు.
“యాంకర్ మీరా, నేనా. మీరెవరు డిసైడ్ చేయడానికి? మీకు కనీసం డీసెన్సీ తెలియదు” అని దినకర్‌ను ఉద్దేశించి మూర్తి అన్నాడు. మూర్తికి మాటకు మాట జవాబిచ్చాడు దినకర్.
“మీ అరాచకం నా దగ్గర నడవదు. ఎక్కడైనా బయట చేసుకోండి. నా స్టూడియోలో చేయవద్దు” అని మూర్తి ఘాటుగా అన్నాడు. . ” మోడరేటరా, మీడియేటరా ” అని దినకర్ అంతే ఘాటుగా మూర్తిని నిలదీశాడు.
అమరావతిలోనే రాజధాని ఉండాలనే డిమాండ్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ దీక్ష, ధర్నా చేశారని మూర్తి ప్రస్తావించాడు.
కానీ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని దినకర్ అన్నాడు.
దీంతో మూర్తి తీవ్ర ఆగ్రహానికి గురై ఊగిపోయాడు. తానొక యాంకర్‌ననే విషయాన్ని మరిచిపోయి శివాలెత్తాడు.
” యూ ఆర్ ఎ లయర్” అని మూర్తి గట్టిగట్టిగా కేకలు వేస్తూ, చేతులూ తిప్పుతూ పదేపదే దినకర్‌ను ఉద్దేశించి అన్నాడు.
” యూ ఆర్ ఎ లయర్” అంటూ దినకర్ కూడా మూర్తికి ఏ మాత్రం తగ్గకుండా అరవడం మొదలు పెట్టాడు.
“ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నది మీరు” అని మూర్తి అన్నాడు. అంతేకాదు యూ ఆర్ ఎ చీట్ అని పదేపదే మూర్తి గట్టిగా కేకలు వేయసాగాడు.
దినకర్ కూడా అదే మాటను రిపీట్ చేశాడు.
“మీరు దరిద్రం” అని మూర్తి అంటే, “మీరు నీచం” అని దినకర్ తిట్టాడు.
“మొన్నటి వరకు తెలుగుదేశంలో, ఇప్పుడు బీజేపీలో ఉన్నావు. నువ్వొక శని” అని దినకర్‌ను ఉద్దేశించి మూర్తి తీవ్రంగా దూషించాడు.
తానేమీ తక్కువ కాదని దినకర్ కూడా మూర్తికి దీటుగా ప్రతిస్పందించాడు. “నువ్వు రోజుకొక చానల్ మారడం లేదా” అంటూ మూర్తి నైజాన్ని తూర్పార పట్టాడు.
రాష్ట్రానికి నువ్వొక ద్రోహివి అని మూర్తి అంటే, నువ్వొక ప్రజాద్రోహివి అని దినకర్ రియాక్ట్ అయ్యాడు. చర్చను మూర్తి అర్ధాంతరంగా ముగించాడు. చర్చ తర్వాత కూడా వాళ్లిద్దరూ టీవీ5 కార్యాలయంలో తీవ్రస్థాయిలో బూతులు తిట్టుకున్నారని విశ్వసనీయ సమాచారం. పరస్పరం కొట్టుకునే వరకు పరిస్థితి దారి తీయడంతో, కార్యాలయ ఉద్యోగులు విడిపించారని తెలిసింది. కాగా లైవ్‌లో తీవ్రస్థాయిలో తిట్టుకున్న వాళ్లిద్దరికి ఎలా అనిపించిందో కానీ, చూసేవాళ్లు మాత్రం వాళ్లిద్దరిని అసహ్యించుకున్నారు. ఇక జన్మలో ఈ టీవీ డిబేట్లనేవే చూడకూడదనేంత అసహ్యాన్ని, వైరాగ్యాన్ని కలిగించారు.