రెమ్యూనిరేషన్ ఎందుకు చెప్పాలి?

బ్రో సినిమాకు పవన్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇంటర్వూల్లో చాలా మంది ఇదే టాపిక్ అడిగారు. అడగడం వరకు తప్పు లేదు. ఎందుకంటే అది ఇంట్రస్టింగ్ పాయింట్ కాబట్టి.…

బ్రో సినిమాకు పవన్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇంటర్వూల్లో చాలా మంది ఇదే టాపిక్ అడిగారు. అడగడం వరకు తప్పు లేదు. ఎందుకంటే అది ఇంట్రస్టింగ్ పాయింట్ కాబట్టి. కానీ చెప్పడం అన్నది ఎలాగూ సాధ్యం కాదు. నిర్మాత విశ్వప్రసాద్ కొన్నింటికి ఓ మాదిరిగా సమాధానం ఇచ్చారు. అడిగిన పద్దతిని బట్టి ఆయన సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్లారు.

కానీ ఇప్పుడు మంత్రి అంబటి కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. పవన్ ఎందుకు చెప్పాలి? అంతగా అవసరం అయితే ఆదాయపన్ను శాఖ ద్వారా తెలుసుకోవడమే. అభిమానులు, సినిమా మీడియా అడగడం వేరు. మంత్రి అంబటి అడగడం వేరు. 

అభిమానులు, సినిమా మీడియా అడిగేది క్యూరియాసిటీతో. జస్ట్ అడిగి వదిలేస్తారు తప్ప, దాన్ని పట్టుకుని యాగీ చేయరు. అదే విధంగా సినిమా ఖర్చు అంచనా, లాభనష్టాల అనాలసిస్ కోసం అడుగుతారు తప్ప, మరే ఉద్దేశం వుండదు. కానీ మంత్రి అంబటి అడుగుతున్నది ఆరా తీయడం కోసం, అక్కసుతో అనుకోవాల్సి వస్తుంది. తన పాత్రను సెటైరికల్‌గా ప్రొజెక్ట్ చేసారని ఆయనకు ఆగ్రహం వచ్చింది.

ఎలాగూ మంత్రి ఓ ఆరోపణ చేసారు. మనీ లాండరింగ్ చేసారని. ఇది చిన్న ఆరోపణ కాదు. ఇది కానీ రుజువు చేయలేకపోతే, రేపు విశ్వప్రసాద్ కనుక లీగల్ యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వుంటుంది. రాజకీయ నాయకులు కనుక.. చూసుకుందాంలే అనే ధైర్యం వుంటుంది. అందుకే అడ్డగోలు ఆరోపణలు చేసేస్తూ వుంటారు. అదే మామూలు వ్యక్తి లేదా మీడియా కనుక ఇదే ఆరోపణ చేసి వుంటే విశ్వప్రసాద్ లీగల్ నోటీసుతో రెడీ అయిపోయి వుండేవారు. మంత్రి కనుక సైలంట్ గా వున్నారు.

మంత్రి ఈ విషయం మీద ఈడి కి ఫిర్యాదు చేస్తామన్నారు. మంచిది. ఇక మళ్లీ అదే పాట పాడడం ఎందుకు? ఏమైనా అంబటి రాంబాబు ఈ ఉదంతం ద్వారా ఓ ఫైటర్ గా జగన్ దగ్గర మార్కులు కొట్టాలని చూస్తున్నట్లు వుంది. కానీ కామన్ మాన్ దగ్గర మాత్రం నెగిటివ్ అవుతున్నారు.

ఇదంతా బాగానే వుంది కానీ, ఇంత హడావుడి చేసి, ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నా బ్రో సినిమా కలెక్షన్లు మాత్రం రోజు రోజుకూ తగ్గుతున్నాయి కానీ పెరగడం లేదు. అసలు ఆ విషయం అంబటి తప్ప అంతా గమనించినట్లే వుంది హీరో పవన్ తో సహా.