పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యర్థిని ప్రకటించడానికి చంద్రబాబు పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో టీడీపీని సరైన నాయకులు లేరు. 2019 వరకూ కనీసం ఎస్వీ సతీష్‌రెడ్డి రూపంలో వైఎస్ కుటుంబాన్ని ఢీకొట్టగల నాయకుడు ఉన్నారు. టీడీపీ మోసానికి విసిగిపోయిన సతీష్‌రెడ్డి క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పులివెందులలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది.
ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్న సామెత చందాన… బీటెక్ రవి టీడీపీకి పెద్ద నాయకుడు అయ్యారు. రాజకీయంగా బీటెక్ రవి కసనూరు గ్రామానికి ఎక్కువ, సింహాద్రిపురం మండలానికి తక్కువ. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా వైఎస్ వివేకానందరెడ్డిపై గెలుపొందడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అంతే తప్ప, ఆయనేమీ పులివెందులలో పొడిచింది, పొడిచేది ఏమీ లేదు.
బీటెక్ రవి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని కొన్ని నెలల క్రితం పులివెందుల టీడీపీ నాయకులు తీర్మానించారు. సతీష్‌రెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకుని, ఆయనకే పులివెందుల టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ కడపకు వచ్చిన సందర్భంలో కూడా అందరినీ కలుపుకుని పోలేదని, ఒంటెత్తు రాజకీయాలు చేయడం ఏంటని బీటెక్ రవికి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. బీటెక్ రవి మీడియా ముందు హల్‌చల్ చేస్తూ, రాష్ట్ర నాయకుడిగా ప్రచారం చేసుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో అతనికి అంత సీన్ లేదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఊరూరా ఏజెంట్లను కూడా బీటెక్ రవి పెట్టుకోలేరని ఏ ఒక్క టీడీపీ కార్యకర్తను అడిగినా చెబుతారు. సతీష్‌రెడ్డి కుటుంబానికి నియోజకవర్గంలో కొంత మేరకు బలం వుందని, ఆయనైతే అంతోఇంతో వైఎస్ కుటుంబానికి ఎదురు నిలబడగలరనే అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో వుంది. బీటెక్ రవి, రాంగోపాల్‌రెడ్డి తదితరులంతా దిబ్బల మీద కోళ్లనేది ఆ పార్టీ కార్యకర్తల భావన. జగన్ ప్రత్యర్థి బీటెక్ రవి కావడం వల్ల, వైసీపీ మెజార్టీని పెంచడమే తప్ప, మరో అవకాశమే లేదనేది సొంత పార్టీ నేతల అభిప్రాయం.