రాజకీయాల్లో తప్ప, వ్యాపారంలో పార్టీల ప్రస్తావనే వుండదు. పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అనే నానుడికి సరిగ్గా సరిపోయే వ్యాపారం ఇది. పులివెందులలో టీడీపీ ఆశా దీపమైన ఆ నాయకుడికి ప్రధాన ఆదాయ వనరు పేకాట క్లబ్బుల నిర్వహణ. మాజీ మంత్రి, కడప జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడితో కలిసి బెంగళూరు, హైదరాబాద్‌లలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ బాగా సంపాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేతో పూర్వ అనుబంధాన్ని ఆసరాగా చేసుకుని ఆయన గెస్ట్‌హౌస్‌లోనే పెద్ద ఎత్తున పేకాటను నిన్నమొన్నటి వరకూ నిర్వహించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని తన మండలానికి సమీపంలోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులతో టీడీపీ ఆశా దీపమైన నాయకుడికి సన్నిహిత సంబంధాలున్నాయి.
అనంతపురం జిల్లాలోని ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో బాగా పాపులర్. నిత్యం ప్రజల్లో వుంటున్నట్టుగా సోషల్ మీడియాలో లైవ్‌లు ఇస్తూ, వారి సమస్యలపై ఆరా తీస్తున్నట్టుగా ప్రచారం పొందుతున్నారు. సదరు ఎమ్మెల్యేతో పులివెందుల టీడీపీ ఆశా దీపమైన నాయకుడు స్నేహసంబంధాలను పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో పేకాట క్లబ్బు నిర్వహిస్తే, పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది వుండదని వ్యూహాత్మకంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారని సమాచారం.
క్లబ్ నిర్వహణకు గెస్ట్ హౌస్ ఇచ్చినందుకు నెలకు. 3 లక్షలు చొప్పున బాడుగ చెల్లించినట్టు విశ్వసనీయ సమాచారం. వ్యాపారాల విషయానికి వచ్చే సరికి…పాలునీళ్లలా అధికార, ప్రతిపక్ష నాయకులు కలిసిపోవడంపై కార్యకర్తలు ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకుంటున్నారు.