వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై చర్చ సాగుతూనే వుంది. కాంగ్రెస్‌లో చేరే విషయమై ఒక అవగాహనకు వచ్చారని, అయితే షరతులే అడ్డంకిగా మారాయనే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం కోరుతోందని, అందుకు ఆమె ససేమిరా అంటున్నారనేది బహిరంగ రహస్యమే. గత కొంత కాలంగా తన పార్టీ కార్యకలాపాలకు కూడా షర్మిల దూరంగా వుంటున్నారు. కాంగ్రెస్‌తో ఏదో ఒకటి తేల్చుకుని, ఆ తర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో మధ్యస్తంగా షర్మిల ఎదుట కాంగ్రెస్ ఒక ప్రతిపాదన పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. షర్మిలను తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆమెను సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో దింపాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం వుందని తెలిసింది. ఈ మేరకు ఆమెతో మరోసారి చర్చలు జరుపుతున్నారని సమాచారం.
సికింద్రాబాద్ నుంచి షర్మిలను బరిలో దింపడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఆ నియోజకవర్గం నుంచి షర్మిల నిలిస్తే సులువుగా గెలవడంతో పాటు సెటిలర్స్, వైఎస్సార్ అభిమానులు, ఆమె సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయగలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే, షర్మిల కాంగ్రెస్‌లో చేరిక, సికింద్రాబాద్ నుంచి పోటీ తథ్యమని చెప్పొచ్చు.