చీపురు పార్టీలను కూడా ఊడ్చేస్తుందా?

70 సీట్లున్న అసెంబ్లీలో 62 సీట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం ఎంతమాత్రమూ కాదు. అది కూడా గత ఎన్నికలతో పోలిస్తే బలం తగ్గితేనే అన్ని సీట్లు సాధించారు. ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనో,…

70 సీట్లున్న అసెంబ్లీలో 62 సీట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం ఎంతమాత్రమూ కాదు. అది కూడా గత ఎన్నికలతో పోలిస్తే బలం తగ్గితేనే అన్ని సీట్లు సాధించారు. ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనో, ప్రభుత్వ వ్యతిరేకత అత్యంత బలంగా ఉన్నప్పుడో.. ఇలాంటి అరుదైన విజయాలు నమోదు అవుతుంటాయి. పడిన ఓట్ల శాతం 58 గానీ, వచ్చిన సీట్ల శాతం 88. ఇలాంటి అపురూప విజయాన్ని నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ .. చీపురు… ఇప్పుడు ఢిల్లీలో ఇతర పార్టీలను కూడా ఊడ్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఆప్ విజయం సాధించిన తర్వాత.. తమకు మద్దతు పలికే వారందరినీ ఒక కాల్ చేయవలసిందిగా కోరుతూ ఒక మొబైల్ నెంబరును ఇచ్చింది. కేవలం 24 గంటల్లో పది లక్షల మంది ప్రజలు ఆ నెంబరుకు కాల్ చేశారు. హ్యాట్రిక్ విజయంతో ఏర్పాటు అవుతున్న ప్రభుత్వానికి అంత పెద్ద స్థాయిలో మద్దతు పలికారు. ఇది అపురూపమైన విషయం.

ఇప్పుడు ఆప్ , ఢిల్లీలోని ఇతర పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతటి అజేయమైన బలసంపత్తులు, ప్రజాదరణతో  చెలరేగుతున్న పార్టీ అండలో ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు! అసలే కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీలో సమాధి అయిపోయింది. మరీ దయనీయంగా 0 సీట్లు గెలుచుకుంది. గెలిచినందుకు అని కాకుండా, భాజపాను ఓడించినందుకు కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం.. ఆప్ ను అభినందిస్తే.. శర్మిష్ట ముఖర్జీ మన దుకాణాలు మూసేద్దామా అంటూ విరుచుకు పడ్డారు. కానీ.. తమాషా ఏంటంటే.. ఢిల్లీలో కాంగ్రెస్ దుకాణం మూయబడే ఉన్నదనే సంగతిని ఆమె గుర్తించలేదు. ఆ పార్టీని కూడా ఆప్- చీపురు ఊడ్చేసే అవకాశం ఉంది.

భాజపా కేంద్రంలో అధికారంలో ఉండగా కాస్త కష్టంగానీ.. లేపోతే.. భాజపాను కూడా ఢిల్లీలో చీపురు ఊడ్చేయగలదు. ఇతర చిన్న సన్నా పార్టీలు ఏమైనా ఉంటే వాటిని మాత్రం సమూలంగా ఊడ్చి తమ బుట్టలో వేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.