ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తులు, వివిధ ఇన్ ఫ్రా సంస్థలపై తాము చేపట్టిన ఐటీ రైడ్స్ కు సంబంధించి సదరు శాఖ ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఆరు రోజుల పాటు జరిగిన ఇటీవలి రైడ్స్ లో అత్యంత భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడినట్టుగా ఐటీ అధికారులు ప్రకటించారు. ఈ మొత్తం విలువ రెండు వేల కోట్ల రూపాయలకు పైనే అని ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం!
ఈ కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన వివిధ మూలాల్లో ఐటీ రైడ్స్ జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ, పుణే వంటి ప్రాంతాల్లో ఈ వ్యక్తులకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లలో ఐటీ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా భారీ అక్రమాస్తులకు సంబంధించిన చిట్టాలు దొరికినట్టుగా సమాచారం. క్యాష్ విషయానికి వస్తే 75 లక్షల రూపాయల వరకూ దొరికిందని, ఇంకా భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అనేక లాకర్లను సీజ్ చేసినట్టుగా సమాచారం. డాక్యుమెంటెడ్ ఆస్తుల విలువ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు అని సమాచారం.
గత ఆరు రోజుల్లో ఐటీ రైడ్స్ ను ఎదుర్కొన్న ప్రముఖుల్లో ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఒకరు. ఆయన ఇంటిపై జరిగిన రైడ్స్ లో తొలి రోజే 150 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు బయటపడినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడికు సంబంధించిన ఆఫీసుల్లో కూడా తనిఖీలు జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఇలా ఈ ప్రముఖుల ఇళ్లల్లో ఆరు రోజుల తనిఖీలకే రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. బయటకు పెద్దగా హడావుడి లేని వారి దగ్గరే ఈ స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయనే అంశం సంచలనం రేపుతోంది!