స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమ ప్రభుత్వం ఇంత విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా.. ఇంకా ఎన్నికల్లో డబ్బు అవసరం ఉండదనేది సీఎం ఉవాచ. ఈ మాటకు రెండు రకాల అర్థాలున్నాయి. వాటిని గురించి చర్చించుకునే ముందు.. ఈ మాటలు వింటే ఒక ఆశ పుడుతోంది. కేవలం డబ్బు ప్రాతిపదికగా కాకుండా.. స్వచ్ఛత, పార్టీకి సేవలందించడం ప్రాతిపదికగా నిరపేద వ్యక్తులకు, కార్యకర్తలకు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది.
చట్టసభల ఎన్నికలు పూర్తిగా ధనమయం అయిపోయాయి. చట్టసభలకు ప్రాతినధ్యం అంటేనే.. అదేదో కోట్లు కురిపించే కనకపు సింహాసనం అనిభావిస్తున్న వారంతా.. అదేస్థాయిలో కోట్లకు కోట్లు తగలేసి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడం ఎలాగా? అనే లక్ష్యాలతోనే జీవిస్తూ.. అవినీతి పరులుగా అభాసు పాలవుతున్నారు.
అయితే ఎన్నికల్లో ఇలాంటి పెడపోకడలకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పించారు. ప్రస్తుతం స్థానిక సంస్థలు, పురపాలక సంస్థలకు దాదాపుగా ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో.. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయంపై మంత్రివర్గ సహచరులతో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసేవారికి కఠిన శిక్షలు విధించేలా సవరణలు ఉండాలని జగన్ పిలుపు ఇచ్చారు. ఒకవేళ ఎన్నికైన తర్వాత అయినా.. అలాంటి అక్రమాలు బయటపడితే పదవీచ్యుతుల్ని చేసేలా మార్పులు చేయబోతున్నారు. ధన, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఆర్డినెన్స్ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఇంకా ధనప్రభావం ఎందుకు అనేది జగన్ వాదన. దీనికి రెండు అర్థాలున్నాయి.
1) జగన్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తునది గనుక.. లబ్ధిదారులైన ప్రజలంతా జగన్ పార్టీకే ఓట్లు వేస్తారన్నది.
2) ఇన్ని పథకాల ద్వారా పేదల జీవితాలకు ఎలాంటి ఢోకా, వెలితి లేకుండా.. సౌకర్యవంతమైన పాలన అందుతున్నది గనుక.. వారు ఓట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదనేది రెండోది.
ఏది ఏమైనప్పటికీ.. స్థానిక సమరంలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట నిర్ణయాన్ని శెభాష్ అనాల్సిందే. కనీసం ఈ ప్రభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ అయినా.. డబ్బు ప్రాతిపదికగా కాకుండా, అభ్యర్థి గుణగణాలు, పార్టీకి- ప్రజలకు విధేయుడై ఉండడం గమనించి.. పేదలకు కూడా టికెట్లు ఇస్తే ప్రజల దృష్టిలో మరింత మంచిపేరు తెచ్చుకుంటుంది.