వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఖాళీ ఏర్పడుతున్న నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నాలుగు పదవులు ఎవరికిస్తారనే విషయమై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.
ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రంగా కసరత్తు చేశారు. విజయసాయిరెడ్డిని మళ్లీ కొనసాగించనున్నారని సమాచారం. ఇక మిగిలిన మూడు స్థానాలకు ప్రముఖ న్యాయవాది, నిర్మాత నిరంజన్‌రెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావులను ఎంపిక చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
బీద మస్తాన్రావుది నెల్లూరు జిల్లా కావలి. ఈయన కావలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజ్యసభకు పంపుతానని గతంలో జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ నలుగురు అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లీ కృపారాణి పేరు కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈమె వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. రాజ్యసభ రేస్‌లో ఉన్నారు.
నిరంజన్‌రెడ్డి లేదా కృపారాణిలలో ఒకరిని రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు రెడ్లు, మరో ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయిం చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ నలుగురు అభ్యర్థుల మార్పు వుండక పోవచ్చు.