కిరణ్ తో మరోసారి బాబు మంత్రాంగం?

కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశానికి బద్ద వైరుధ్యం. కానీ అదంతా గతం. 2019 ఎన్నికల టైమ్ నుంచే చంద్రబాబు కు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి మధ్య ఓ అవగాహన అనేది ఏర్పడిపోయింది అని…

కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశానికి బద్ద వైరుధ్యం. కానీ అదంతా గతం. 2019 ఎన్నికల టైమ్ నుంచే చంద్రబాబు కు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి మధ్య ఓ అవగాహన అనేది ఏర్పడిపోయింది అని వార్తలు వచ్చేసాయి. 

ఆ ఎన్నికల్లో భాజపాను, మోడీని ఓడించి, కాంగ్రెస్ కూటమిని గద్దెనెక్కించడానికి చంద్రబాబు అహరహం కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. పైగా ఈ విషయం క్లారిటీగా అర్థమై, మోడీ-అమిత్ షా ద్వయం బాబును పూర్తిగా పక్కన పెట్టారు. సుజనా లాంటి వాళ్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వలసవెళ్లి లబియింగ్ చేసినా ఫలితం లేకపోయింది. 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినపుడు బాబు-రాహుల్ బంధం మరోసారి తెరమీదకు వచ్చింది. బాబుకు అనంగు సహచరుడు అయిన రేవంత్ ను పిసిసి నేతగా ఆయన సలహా, సిఫార్సుల మేరకే చేసారని గట్టిగా వార్తలు వినిపించేసాయి. సరే అదంతా అయిపోయింది.

ఇప్పుడు ఆంధ్ర పిసిసి నేతగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించ బోతున్నారని వార్తలు వచ్చేసాయి. ఇది కూడా బాబుగారి ప్లాన్ లో భాగమే అంటూ గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు తెలుగుదేశంలోనే వున్నారు. అది వేరే సంగతి. కిరణ్ కుమార్ రెడ్డి నమ్మిన సమైక్యాంధ్ర ఉద్యమనేత, ఉద్యోగసంఘాల నేత పరుచూరి అశోక్ బాబు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వున్నారు. అది కూడా వేరే సంగతి అనుకుందాం. 

కానీ కిరణ్ కుమార్ రెడ్డి ది బాబు అనుకూల వైఖరి అని ఆయన పాలన సమయంలోనే వెల్లడయింది. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు. దాని కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. కనీసం పది ఓట్లు వస్తాయి అనుకున్న ఏ ఎత్తుగడను వదలుకోవడం లేదు. రాయలసీమ ప్రాంత, రెడ్డి సామాజిక వర్గం ఇవన్నీ దృష్టిలో వుంచుకునే కిరణ్ కుమార్ రెడ్డిని పిసిసి అధినేతగా రాజకీయాల్లోకి క్రియాశీలకంగా చేయాలని చంద్రబాబు ఎత్తుగడ వేసారని రాజకీయాల్లో వినిపిస్తోంది.

జగన్ మీద అసంతృప్తి ఏమైనా వున్న రెడ్లు అటు మొగ్గుతారని, అలాగే సీమ రెడ్ల ఓట్లు చీల్చవచ్చని బాబుగారు అనుకుంటే అనుకుని వుండొచ్చు. కానీ ఇక్కడ బేసిక్ సమస్య ఏమిటంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అన్నది లేదు. ఆ పార్టీ జనాలు ఏనాడో వైకాపా లోకి తొంభై శాతం మారిపోయారు. మిగిలిన పది శాతం మందితో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని రివైవ్ చేయడం అన్నది అంత సులువైన పని కాదు.

అయినా ఇలా కాంగ్రెస్ ను జనసేనను బలోపేతం చేసే సలహాలు సూచనలు ఇచ్చి వాటి కూటమితో జగన్ ను ఓడించవచ్చు అన్న ఆలోచన బాగానే వుంది. కానీ రేపు ఏదైనా అనుకోనిది జరిగి వాటితో జతకట్టే పరిస్థితి లేకపోతే, అవన్నీ నెగిటివ్ ఓటును చీల్చుకుంటే బాబుగారి పరిస్థితి ఏమిటి?