ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలలో భాగంగా ఒక్కొక్కరి మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తూ వెళుతున్నారు. అయితే ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలనే సామెత చందంగా ఉద్యోగ సంఘాల వారు కూడా కేసీఆర్ ద్వారా తమ తమ ప్రయోజనాలను ఈ సమయంలోనే నెరవేర్చుకోవాలని ఆరాటపడుతున్నారు.
తెలంగాణలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రకరకాల డిమాండ్లతో ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. వీటిలో కొత్త పిఆర్సి ఏర్పాటు చేయడం, ఈహెచ్ఎస్ సక్రమ అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం అనేవి కీలక డిమాండ్లు.
అయితే కెసిఆర్ సర్కారుతో సానుకూల వైఖరితో వ్యవహరించే ఉద్యోగ సంఘాలు ఆయనకు ఇబ్బంది లేకుండా ఈ డిమాండ్లు తెరపైకి తెస్తున్నాయి. కొత్త పిఆర్సి కమిటీ అనేది ప్రభుత్వం ఎటూ ఏర్పాటు చేయాల్సిందే. అందులో ఉద్యోగ సంఘాలు పనిగట్టుకుని పెద్దగా సాధించేదేమీ లేదు. అయితే సిపిఎస్ రద్దును సాధించగలిగితే ఉద్యోగ సంఘాల ఘనతగా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లు లేని ఈ డిమాండ్‌ను ఉద్యోగులు కొత్తగా తెరపైకి తెచ్చారు. ఇది మాత్రం కెసిఆర్ కు విషమ పరీక్ష అవుతుంది. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ సీపీఎస్ ప్రస్తావన తెస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గనుక.. సీపీఎస్ ను రద్దుచేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్కడ రద్దుచేశారు. ఆ ముఖ్యమంత్రే తెలంగాణలో కూడా ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రకటనను ఉద్యోగులు నమ్మితే గనుక.. ఉద్యోగుల ఓటు బ్యాంక్ చీలుతుంది. కెసిఆర్ సీపీఎస్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కాంగ్రెస్ రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది.
సిపిఎస్ రద్దు చేయడం వలన ప్రభుత్వంమీద అతిపెద్ద భారం పడుతుంది. పొరుగు రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగులకు మాట ఇచ్చేసినందుకు సిపిఎస్ రద్దు చేయలేక, అలాగని మాట తప్పినట్టుగా ఉండలేక.. వారి నిరసన జ్వాలల మధ్య జగన్ సర్కారు సతమతం అవుతోంది. పైగా కెసిఆర్ కు ఇంకొక సమస్య కూడా ఉంది. ఇప్పుడు భారాస జాతీయ పార్టీ గనుక తెలంగాణలో అమలు చేస్తే రేపు ఇదే హామీని దేశవ్యాప్తంగా ఇవ్వాల్సి వస్తుంది. అంత భారాన్ని మోయడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారా? అనేది పెద్ద ప్రశ్న. ఈ చిక్కు పరిస్థితులను గులాబీ దళపతి ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.