ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వివాహ బంధం క్లీన్ బౌల్డ్ అయ్యింది. మోడల్స్‌తో అతనికి వివాహ జీవితం కలిసి రాలేదు. కాగా తాము త్వరలో వీడాకులు తీసుకోనున్నట్టు క్లార్క్, కైలీ దంపతులు వెల్లడించారు. కొంతకాలంగా వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కలిసి ఉండే పరిస్థితి లేకపోవడంతో, విడిపోయి స్నేహంగా ఉండాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తమకు కష్టమే అయినా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని ఇద్దరూ తెలిపారు.
కైలీతో పెళ్లికి ముందు మోడల్ లారా బింగిల్‌తో క్లార్క్ నిశ్చితార్థం జరిగింది. అయితే వారిద్దరి అనుబంధం పెళ్లికి దారి తీయకముందే ఎవరి దారి వారు చూసుకున్నారు. 2010లో లారా బింగిల్‌తో క్లార్క్ విడిపోయాడు. ఆ తర్వాత బింగిల్.. నటుడు, అవతార్ హీరో సామ్ వర్తింగ్టన్‌ను 2014లో వివాహం చేసుకున్నారు.
మాజీ మోడల్, టీవీ ప్రజెంటర్‌గా కైలీ ఆస్ట్రేలియాలో సుపరిచితురాలు. లారాతో విడిపోయిన తర్వాత కైలీతో క్లార్క్ ప్రేమాయనం సాగించాడు. 2012లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి నాలుగేళ్ల ముద్దులొలికే కుమార్తె కెల్సే ఉన్నారు. కుమార్తెను ఇద్దరూ చూసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుని పరస్పరం గౌరవించుకుంటూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే కోర్టు వెలుపలే విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని క్లార్క్ దంపతులు నిర్ణయించుకున్నారని సమాచారం. ఆరు నెలలుగా వారిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. అవి కేవలం వదంతులేనని కైలీ ఖండిస్తూ వచ్చారు. అంతేకాదు తమ బంధం ఎంతో బలంగా ఉందని చెబుతూ రావడం గమనార్హం. కాగా 2011లో రికీ పాంటింగ్ తర్వాత క్లార్క్ ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఘనతను క్లార్క్ సొంతం చేసుకున్నాడు. కానీ వ్యక్తిగత జీవితంలో మోడల్ లారా బింగిల్‌తో నిశ్చితార్థంతోనూ, మరో మోడల్ కైలీతో పెళ్లి తర్వాత విడిపోవాల్సి వచ్చింది. రెండుసార్లు కూడా మోడల్ రంగం నుంచి వచ్చిన యువతులతో వివాహ బంధం విఫలం కావడం గమనార్హం.