తానేమైనా కేజ్రీవాల్ అనుకుంటున్నాడా జ‌గ‌న్?

నిన్న మంత్రి మండ‌లి స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చూస్తుంటే ఓ అనుమానం క‌లుగుతోంది. త‌న‌ను ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌తో, ఏపీని ఢిల్లీతోనూ పోల్చుకుంటున్నాడ‌నే భావ‌న క‌లుగుతోంది. అయితే ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం ప్ర‌మేయాన్ని…

నిన్న మంత్రి మండ‌లి స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చూస్తుంటే ఓ అనుమానం క‌లుగుతోంది. త‌న‌ను ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌తో, ఏపీని ఢిల్లీతోనూ పోల్చుకుంటున్నాడ‌నే భావ‌న క‌లుగుతోంది. అయితే ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం ప్ర‌మేయాన్ని పూర్తిగా తుడిచేయాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు అభినందించాల్సిందే. ఎందుకంటే ఎన్నిక‌ల ఖ‌ర్చు నాయ‌కుల‌కు భ‌రించ‌లేని విధంగా తీవ్ర భార‌మైంది. సామాన్యుల‌కైతే ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డం త‌ప్ప‌, క‌నీసం పోటీ చేయాల‌నే ఆలోచ‌న చేయ‌డానికైనా ధైర్యం చాల‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో మంత్రి మండ‌లి స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఆయ‌న ఏమ‌న్నాడంటే…

‘ఎన్నిక‌ల్లో ధ‌నం, మ‌ద్యం ప్ర‌వాహానికి ఎక్క‌డో ఒక‌చోట బ్రేక్ ప‌డాలి. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నుంచే దానికి నాంది ప‌ల‌కాలి. రూ.కోట్లు ఖ‌ర్చు పెట్టి గెల‌వాల్సిన ప‌రిస్థితే ఉంటే వ‌చ్చేది కార్సొరేట్లే. ఆ ప‌రిస్థితి వ‌ద్దు. ప్ర‌జానాయ‌కులు, పార్టీ జెండా మోసిన నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల‌కు ఈ ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పించాలి. ఇన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. ఇంకా ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టే ప‌రిస్థితి ఉండ‌రాదు’….ఇదీ జ‌గ‌న్ అభిప్రాయం.

త‌మ‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్రం అన్ని రాజ‌కీయ పార్టీలు జ‌నాన్ని డ‌బ్బు, మ‌ద్యానికి అల‌వాటు చేసి…ఇప్పుడు వ‌ద్దంటే మాత్రం ప‌రిణామాలు ఎలా ఉంటాయో స్థానిక నాయ‌కుల‌కు బాగా తెలుసు. ఇన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని, ఇంకా ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టే ప‌రిస్థితి ఉండ‌రాద‌ని జ‌గ‌న్ చెప్ప‌డంలో వాస్త‌వం ఉంది.

కానీ దేనిలెక్క దానిదే. అధికార పార్టీగా సంక్షేమ ప‌థ‌కాల గురించి వైసీపీ ప్ర‌చారం చేసుకుంటే….ప్ర‌తిప‌క్ష పార్టీల సంగతేంటి? అందువ‌ల్లే ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌ప్ప‌నిస‌రిగా డ‌బ్బు పంపిణీ చేసి తీరుతాయి. అప్పుడు చ‌చ్చిన‌ట్టు అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు కూడా ఎన్ని ఇబ్బందులు ప‌డినా ఓట‌ర్ల‌కు డ‌బ్బు, మ‌ద్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. జ‌గ‌న్ చెప్పాడ‌ని, కాదు కూడ‌ద‌ని ఏ నాయ‌కుడైనా అనుకుంటే…దాని ఫ‌లితం కూడా అనుభ‌వించాల్సిందే.

మ‌రీ ముఖ్యంగా  ఢిల్లీ ఎన్నిక‌ల్లో సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్లే కేజ్రీవాల్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం…జ‌గ‌న్‌పై బ‌ల‌మైన ముద్ర‌వేసిన‌ట్టుంది. అందువ‌ల్లే ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాల గురించి అంత గ‌ట్టిగా మాట్లాడ్డం. అయితే జ‌గ‌న్ ఇక్క‌డో విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకోవాలి. ఢిల్లీ అనేది మ‌హాన‌గ‌రం. విద్యావంతులు, మేధావులు, ఆలోచ‌నాప‌రులు, స‌మాజ మార్పును కాంక్షించే బ‌ల‌మైన స‌మూహం ఉన్న దేశ రాజ‌ధాని న‌గ‌రం. ప‌రిపాల‌నా తీరు, నాయ‌కుల న‌డ‌త‌, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుతెన్నులు…ఇలా అనేక అంశాల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌తో, వివేకంతో ఓటు వేస్తారు, వేశారు.

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి ఢిల్లీతో పోల్చితే పూర్తి భిన్నం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంతో ఉంది. వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం. కేవ‌లం కోస్తాలోని రెండు, మూడు జిల్లాల్లో మాత్ర‌మే సాగునీటి సౌక‌ర్యం ఉంది. ఆ ప్రాంతాల్లో మాత్ర‌మే ఏడాదికి రెండు పంట‌ల‌కు త‌క్కువ కాకుండా పంట‌లు పండిస్తూ సంపాదించుకుంటున్నారు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, కోస్తాలోని ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాలోని ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌రవుల‌తో రైతులు, ప్ర‌జ‌లు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి. అక్క‌డి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు వేరుగా ఉంటాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆద‌ర్శాల గురించి క‌ల‌లు క‌నే ప‌రిస్థితి ఉండ‌దు. ఆక‌లితో క‌డుపు మాడుతుంటే ఆద‌ర్శాలు ఎవ‌రికి కావాలి? రాజ‌కీయ నాయ‌కులంటే దోపిడీదారుల‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. ఎన్నిక‌ల‌ప్పుడే వాళ్ల నుంచి సాధ్య‌మైనంత ఎక్కువ‌గా గుంజుకోవాల‌నే భావ‌న మెజార్టీ ప్ర‌జ‌ల్లో ఉంది. ముందు ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ నాయ‌కుల‌పై మంచి అభిప్రాయం క‌లిగేలా స‌మాజంలో చైత‌న్యం తీసుకురావాలి. అందుకు మొట్ట‌మొద‌ట‌గా నాయ‌కుల తీరులో మార్పు రావాలి. క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచే నాయ‌కులకు రాజ‌కీయ పార్టీలు పెద్ద‌పీట వేయాలి.

ఇలాంటి మార్పు జ‌రిగిన త‌ర్వాతే, నాయ‌కులు చెప్పే మాట‌లపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం, గౌర‌వం క‌లుగుతాయి. అప్పుడు మాత్ర‌మే ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం ప్ర‌మేయాన్ని నిరోధించ‌వ‌చ్చు. అలా కాకుండా ఒక్క‌సారిగా ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం, ఇత‌ర‌త్రా ప్ర‌లోభాల‌ను అరిక‌ట్టాల‌నుకుంటే…తిన‌బోతు రుచి చూడ‌టం ఎందుక‌నే సామెత చందాన…జ‌గ‌న్ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంతే…అంతేగా, అంతేగా మ‌రి!

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు