అల వైకుంఠపురములో..దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజికల్ హిట్ అండ్ మ్యూజికల్ హిట్. ఈ సినిమాను హిందీలోకి తీసుకెళ్లాలని కొందరు అనుకున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా ప్లానింగ్ చేసుకుని రీమేక్ రైట్స్ కోసం వచ్చారు. ఇదంతా అందరికీ తెలుసు. చోటా మోటా వెబ్ సైట్ లు అయితే, అమ్మేసారు. ఇంతకీ అంతకీ అంటూ వార్తలు కూడా రాసేసాయి. కానీ వీళ్లకు తెలియని ట్విస్ట్ ఏమిటంటే, రీమేక్ రైట్స్ అమ్మలేదన్న సంగతి. దానికి అల్లు అరవింద్ అడ్డం పడిపోయారన్న వైనం.
విషయం ఏమింటంటే, మీడియేటర్ల ద్వారా రీమేక్ రైట్స్ అమ్మకానికి అంతా రెడీ అయిపోయింది. ఏడు కోట్ల 18 లక్షలు ఒప్పందం. హారిక హాసిని లోని పిడి ప్రసాద్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి డీల్ చేసారు. మధ్యవర్తులకు చెరో పదిలక్షలు కమిషన్ ఇవ్వడానికి కూడా డిసైడ్ అయిపోయింది. అగ్రిమెంట్ ప్రింట్ కూడా తీసేసారు. కానీ ఈ లోగా అల్లు అరవింద్ తరపును ఇద్దరు కీలక వ్యక్తులు రంగ ప్రవేశం చేసి, వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేసారు.
సినిమాను అరవింద్ గారే స్వయంగా హిందీలో తీయాలనుకుంటున్నారని, అమ్మడానికి వీల్లేదని ఆదేశాలు చేరవేసి వెళ్లిపోయినట్లు బోగట్టా. దాంతో వ్యవహారం అలా ఆగిపోయింది. నిజానికి అల వైకుంఠపురములో సినిమా సబ్జెక్ట్ హిందీకి సూట్ అవుతుందా? అంటే అనుమానమే. కానీ జెర్సీ సినిమాతో బాలీవుడ్ లో మరోసారి అడుగుపెట్టిన అరవింద్ ఈ సినిమాను కూడా అక్కడ తానే నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ విషయంలో తివిక్రమ్ నేరుగా అల్లు అరవింద్ ను కలవడానికి ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కలిసి, నచ్చచెప్పి, రీమేక్ రైట్స్ అమ్మించడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆయన ముంబాయి పార్టీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రీమేక్ రైట్స్ కు ఏడుకోట్ల పద్దెనిమిది లక్షలు అంటే చిన్న మొత్తం కాదు. కానీ అరవింద్ తాలూకా ముంబాయ్ టీమ్ మాత్రం, ఇది హిందీలో నిర్మిస్తే వందల కోట్ల ప్రాజెక్టు అయిపోతుందని, ఆయనకు బాగా ఫీడింగ్ ఇచ్చి, ఆ దిశగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.