టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో… అదిగో, వాళ్లూ, వీళ్లు.. అంటూ రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ గొడవ ఇప్పటిది కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు అయినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో అదిగో.. ఆ రెడ్డి, కాదు ఈ దళితుడు అంటూ రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ మార్పు మాత్రం జరగడం లేదు.
ప్రత్యేకించి హుజూర్ నగర్ బై పోల్ లో భార్య ఓడిపోవడంతో ఉత్తమ్ కు కూడా ఆ పదవి పై విసుగు వచ్చినట్టుగా ఉంది. ఈ క్రమంలో మార్పు తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటూ కొన్ని పేర్లు, అలా కాదు వేరొకరు అంటూ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే వీళ్లలో ఎవరికైనా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే సత్తా ఉందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఫలానా వ్యక్తికి పదవి ఇస్తే తెలంగాణ లో కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుందనే అభిప్రాయాలు ఆ పార్టీ కార్యకర్తల్లోనూ, అభిమానుల్లోనే లేవు! రేవంత్ రెడ్డి అంటూ కొంతమంది హడావుడి చేశారు. అయితే రేవంత్ కు చంద్రబాబు భజనే సరిపోతూ ఉందిప్పటికీ. ఇంకా తెలుగుదేశం జిడ్డును ఆయన వదిలించుకోలేకపోతున్నాడు. అలాంటి టీ.కాంగ్రెస్ ను ఏం ఉద్ధరిస్తారాయన?
ఇప్పటికి కాకపోతే మరెప్పటికీ అయినా కేసీఆర్ మీద విసుగుకు వచ్చి, టీఆర్ఎస్ ను వదిలించుకోవాలని జనాలు అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ ఓటేయాల్సిందే తప్ప, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించి, తమ నాయకత్వంతో పార్టీని అధికారంలోకి తీసుకురాగల చేవ ఉన్న నేతలు టీ కాంగ్రెస్ లో కనిపించడం లేదు. గమనించాల్సిన అంశం ఏమిటంటే రాష్ట్ర విభజన కోసం అధిష్టానం పై ఒత్తిడి తెచ్చింది వీళ్లే! అందుకు అనుభవిస్తున్నదీ వీళ్లే!