పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం గురించి వెలువడుతున్న వివిధ సర్వేలు ఒకే మాటే చెబుతున్నాయి. మూడో పర్యాయం కూడా మమతకే బెంగాల్ పీఠం దక్కుతుందనేది ఇప్పటి వరకూ చెప్పిన వివిధ సర్వేల సారాంశం. తాజాగా వెలువడిన టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వే కూడా అదే మాటే చెప్పడం గమనార్హం.
ఈ ప్రీ పోల్ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ మినిమం మెజారిటీని పొందడం ఖాయం. ఉమ్మడి ఏపీ తరహాలో 294 అసెంబ్లీ సీట్లను కలిగిన బెంగాల్ లో టీఎంసీకి ఈ సారి కనీసం 146 నుంచి 163 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే చెబుతోంది. ఈ రకంగా మమత మరోసారి మినిమం మెజారిటీతో సీఎం కావొచ్చని ఈ సర్వే చెబుతోంది. ఇది వరకూ పలు మీడియా సంస్థల అధ్యయనాలు కూడా ఇదే మాటే చెప్పాయి.
ఇక రెండో స్థానం మాత్రం బీజేపీదే అని ఈ సర్వే చెబుతోంది. బీజేపీ 99 నుంచి 115 సీట్ల వరకూ సాధించుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ఇది బీజేపీ చాలా పుంజుకోవడమే అవుతుంది. గత పర్యాయం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బీజేపీ నెగ్గింది. గత ఐదేళ్లలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. టీఎంసీ కోల్పోయే సీట్లన్నింటినీ బీజేపీ తన ఖాతాలోకి వేసుకోవచ్చని టైమ్స్ నౌ సర్వే చెబుతూ ఉంది.
అయితే బెంగాల్ లో అధికారం మాత్రం మళ్లీ మమతకే దక్కుతుందని ఈ అధ్యయనం కుండబద్ధలు కొడుతూ ఉంది. ఇప్పటికే బెంగాల్ లో బీజేపీ తన సర్వశక్తులూ ఒడ్డుతూ ఉంది. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని హీటెక్కించారు. దీదీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అయితే మోదీ కూడా మోసం చేశారంటూ వైరి పక్షాలు విరుచుకుపడుతున్నాయి.