తన రాజకీయ అవకాశవాదంతో ఒక ప్రాంతాన్ని అవమానించడానికి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా సార్లు వెనుకాడలేదు. ఏ ప్రాంతానికి వెళితే అక్కడ ప్రాంతాన్ని పొగుడుతూ, ఇతర ప్రాంతాలను దూషించే అలవాటు కలిగి ఉన్నాడు పవన్ కల్యాణ్. అందులో భాగంగా గోదావరి జిల్లాల్లో పలు సార్లు రాయలసీమ సంస్కృతి, రాయలసీమ రౌడీలు అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడాడు. అయితే తనను, తన అన్నను గోదావరి ప్రాంత ప్రజలు ఓడిస్తే.. కనీసం తన అన్నను ఎమ్మెల్యేగా గెలిపించింది రాయలసీమ ప్రజలే అనే ఇంగిత జ్ఞానం కూడా పవన్ కల్యాణ్ కు ఉండదు. అందుకే రాయలసీమను అవమానించేలా మాట్లాడుతూ ఉంటాడు.
అయితే తన రాజకీయ అవకాశవాదంతో ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కల్యాణ్ చీప్ ట్రిక్స్ వేస్తూ ఉంటాడు. ఇది వరకూ ఒకసారి కర్నూలు వెళ్లి అక్కడ తన మదిలో రాజధాని కర్నూలే అని పవన్ వ్యాఖ్యానించాడు. అయితే హై కోర్టును కర్నూలుకు తరలించడాన్ని మాత్రం పవన్ వ్యతిరేకించాడు, వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. కర్నూలుకు హై కోర్టు అనే ప్రకటనను కూడా పవన్ కించపరుస్తూ మాట్లాడాడు. ఇప్పుడు మళ్లీ ఒక అమ్మాయి పై అఘాయిత్యం కేసును పొలిటికల్ గా వాడుకునేందుకు పవన్ కర్నూలు వెళ్లారు.
ఈ సందర్భంగా రాయలసీమ ఉద్యమకారులు పవన్ గో బ్యాక్ అంటున్నారు. పవన్ కల్యాణ్ కు ఎవరితో అయినా రాజకీయ వైరం ఉంటే వారిని తిట్టుకోవాలని.. రాయలసీమను కించపరచడం ఏమిటని వారు ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కర్నూలు రాకను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ఆయనను తాము అడ్డుకుంటామని వారు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కు నిజంగానే ఏమైనా సుగాలి ప్రీతీ మీద జాలి ఉంటే, వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. తన రాజకీయం కోసం పవన్ కల్యాణ్ ఇష్టానికి మాట్లాడటాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్టుగా వారు ప్రకటించారు.