తమిళనాడులో తాజాగా ఓ పోస్టర్ తీవ్ర కలకలం రేపుతోంది. హీరో విజయ్‌పై ఐటీ దాడులు, ఢిల్లీలో ఆప్ విజయం వెనుక రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి ఏపీ సీఎం జగన్ పోస్టర్లు ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. జగన్, ప్రశాంత్ కిషోర్ మధ్య హీరో విజయ్ ఫొటోతో కూడిన పోస్టర్…సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్లో ‘మేము ఆంధ్రాను రక్షించాం. మీరు తప్పక తమిళనాడు, దేశాన్ని కాపాడాలి’ అంటూ జోసెఫ్ విజయ్ ఇమామ్ లంచ్ కమాండర్ విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మరీ ముఖ్యంగా ఈ పోస్టర్లు తమిళనాడులోని మధురైలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీరో విజయ్ అభిమానులు ఈ పోస్టర్లను అతికించారు.
విజయ్ ఇంట్లో ఐటీ సోదాలను కక్ష కట్టి చేశారన్నది అతని అభిమానుల వాదన. కేంద్రంలోని బీజేపీ తమ అభిమాన హీరోని టార్గెట్ చేసిందని విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సేవ్ తమిళనాడు అంటూ వారు నినదిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే పార్టీకి పీకే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించేందుకు స్టాలిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పీకే ఫొటోలు విజయ్‌తో కలిసి వేయడంపై తమిళనాడులో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సందర్భంలో జగన్ ఫొటోను కూడా వేయడంపై వైసీపీ శ్రేణులు ఇదేమీ కుట్ర కాదు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో జగన్ సంబంధాలను చెడగొట్టేందుకు ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలకు తెరదీశారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.