ఢిల్లీలో జ‌గ‌న్.. గ‌ల్లీలో ప‌వ‌న్.. వాట్ నెక్ట్స్?

ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో.. ప్ర‌ధాన‌మంత్రి నివాసంలో ఉన్న స‌మ‌యంలో.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో క‌ర్నూలు కొండారెడ్డి బురుజు స‌మీపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రోడ్డు మీద క‌నిపించారు! శీతాకాలంలో కూడా సాయంత్రానికి…

ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో.. ప్ర‌ధాన‌మంత్రి నివాసంలో ఉన్న స‌మ‌యంలో.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో క‌ర్నూలు కొండారెడ్డి బురుజు స‌మీపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రోడ్డు మీద క‌నిపించారు! శీతాకాలంలో కూడా సాయంత్రానికి కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాయ‌ల‌సీమ రోడ్ల మీద‌కు రాలేక‌పోయాడు. ప‌వ‌న్ వీరాభిమానులు, కుర్ర‌కారు అక్క‌డ హ‌డావుడి చేశారు. పిల్ల సేన అని జ‌న‌సేన‌ను ప్ర‌త్య‌ర్థులు ఎందుకంటారో ప‌వ‌న్ చుట్టూ చేరిన వాళ్ల‌ను చూస్తే అర్థం అవుతుంది!

ఇక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనేక ఊహాగానాల‌కు కార‌ణం అవుతూ ఉంది. కేంద్ర కేబినెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర‌బోతోంద‌నే ఊహాగానాల‌కు కార‌ణం అయ్యింది మోడీతో జ‌గ‌న్ స‌మావేశం. అయితే వైసీపీ కేంద్ర కేబినెట్లో చేర‌బోతోంది అనే ఊహాగానాలు కొత్త‌వేమీ కావు. 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ వార్త‌ల వ‌చ్చాయి. అయితే అవేం నిజం కాలేదు.

మ‌రి ఇప్పుడేం జ‌రుగుతుందనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతున్న అంశం. రాష్ట్రాల వారీగా త‌గులుతున్న ఎదురుదెబ్బ‌ల‌తో బీజేపీ వాళ్లు స్ట్రాట‌జీ మారుస్తున్నార‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. దీంతో కేబినెట్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ అని ప్రాంతీయ పార్టీల‌ను చేర్చుకోవ‌డానికి మోడీ రెడీ అవుతున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే దోస్తు బీజేపీకి త‌గిలాడు. అయితే ఈయ‌న క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గ‌ని దోస్తు. ఒక‌టికి రెండు చోట్ల పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

ఓట‌మి పాల‌య్యాకా కూడా చంద్ర‌బాబుకు పార్ట్ న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు త‌ప్ప‌.. మ‌రోటి కాద‌నే ట్యాగ్ క‌లిగిన దోస్తు ప‌వ‌న్. కాబ‌ట్టి ప‌వ‌న్ ను బీజేపీ అధిష్టానం సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డంలో పెద్ద వింత ఏమీ లేదు. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో జ‌రిగిన ఘోరాల విష‌యంలో అప్పుడు చంద్ర‌బాబును ప్ర‌శ్నించ‌లేక ఇప్పుడు జ‌గ‌న్ ను ప్ర‌శ్నించేస్తున్న మేధావి ప‌వ‌న్. ఇలా వ్య‌వ‌హ‌రిస్తే ఏదో ఒక కోశాన ఎవ‌రికైనా న‌మ్మ‌కం ఎలా క‌లుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరే అంశం గురించి పూర్తి స్ఫ‌ష్ట‌త వ‌స్తే, ఒక‌వేళ అదే జ‌రిగితే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అది మ‌రో శ‌రాఘాతం అయ్యే అవ‌కాశాలున్నాయనేది మాత్రం వాస్త‌వం.