వాలంటీర్లు… సచివాలయం అంటే అంత వణుకా…?

ఏపీలో నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గడగ గడపకూ ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది. అదే ఏడాది…

ఏపీలో నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గడగ గడపకూ ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది. అదే ఏడాది సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు  చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రతీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్లతో ప్రభుత్వం ప్రతీ గడపకూ వచ్చింది.

ఇది నిజంగా చెప్పుకుంటే పాలనాపరంగా గొప్ప సంస్కరణగా చూడాలి. దేశంలో ఏడున్నర దశాబ్దాల కాలంలో పాలన అంటే ఇంకా ఎక్కడ ఉందో తెలియని తీరున సాగుతున్న విధానానికి చెక్ పెడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం  తీసుకుంది.

దీని మీద దేశమంతా ఆసక్తిని చూపిస్తోంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా అమలుకు ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీద విపక్షాలు మాత్రం రాజకీయ కోణం నుంచే చూస్తున్నాయని అంటున్నారు. ఇటీవలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. వారు ప్రజల నుంచి వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం ఆనాడు గమ్మున ఉంది. పైగా పవన్ కామెంట్స్ ని సమర్ధించీ సమర్ధించనట్లుగా చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పౌర సేవలకు వారిని వాడుకుంటామని అన్నారు. తాజాగా మాత్రం అచ్చం పవన్ అన్న మాటలనే టీడీపీ ఫిర్యాదు రూపంలో ఈసీకి నివేదించడం విశేషం.

వాలంటీర్లు ప్రజల నుంచి పర్సనల్ డేటాను కలెక్ట్ చేస్తున్నారు అంటూ విశాఖకు వచ్చిన కేంద్ర ఎన్నికల అధికారుల బృందానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లతో ఓట్ల గల్లంతు జరుగుతోందని మరో ఆరోపణ చేశారు.

వాలంటీర్లనే కాదు సచివాలయ ఉద్యోగులను కూదా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని తెలుగుదేశం సరికొత్త విన్నపం చేయడం విశేషం. సచివాలయ ఉద్యోగులకు అనుభవం లేనందువల్లనే వారిని ఎన్నికల విధులు ఇవ్వవద్దని టీడీపీ ఈసీని కోరినా అసలు విషయం వారంతా ఎక్కడ వైసీపీ సానుభూతిపరులుగా ఉంటారో అన్న భయమే అని అంటున్నారు.

వాలంటీర్ల మీద సచివాలయ ఉద్యోగుల మీద టీడీపీ భయాలు సందేహాలు ఒక వైపు వ్యక్తం చేస్తూ తాము కనుక అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థలను కొనసాగిస్తామని చెప్పడం అంటే నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే తీరుగా ఉందని అంటున్నారు. వాలంటీర్లు అన్నా సచివాలయాలు అన్నా టీడీపీకి ఎందుకు అంత భయమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు దారులు వెతకాలి కానీ ఓటమి కోసం సాకులు వెతుక్కోవడమేంటని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.