ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రపై జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమపై ఆయన ఆశ వదులుకున్నట్టుగా కనిపిస్తోంది. వారాహి యాత్రపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నుంచి ప్రకటన వచ్చింది. తదుపరి వారాహి యాత్ర ఉత్తరాంధ్రలో ప్రారంభం కానున్నట్టు ఆయన తెలిపారు. ఎక్కడైతే తన సామాజిక వర్గం, అభిమానులు , ఇతరత్రా ఓటు బ్యాంక్ ఉందని భావిస్తున్నారో, అక్కడే బలాన్ని మరింత పెంచుకునేందుకు పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు.
ఈ పరంపరలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర చేపట్టాలని పవన్ నిర్ణయించుకోవడం విశేషం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికి రెండు దఫాలుగా వారాహి యాత్ర నిర్వహించారు. అక్కడ జనం వెల్లువెత్తారు. అయితే జనం మాత్రం తన సభలకి వస్తారని, ఓట్లు జగన్‌కు వేస్తున్నారని ఆయన వాపోయిన సంగతి తెలిసిందే. గెలుస్తామనే భరోసా ఇస్తే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని, కానీ ఆ రకమైన సంకేతాలు తనకు ప్రజల నుంచి రావడం లేదని ఆయన నిష్టూరమాడారు.
తాజాగా విశాఖ పట్నం నుంచి మూడో విడత వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టు నాదెండ్ల తెలిపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ దృష్టి పెట్టడాన్ని చూస్తే, ఆ ప్రాంతాల్లోనే తన పార్టీ బలంగా వున్నట్టు పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే బలం లేని రాయలసీమలో కంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించడం మంచిదని ఆయన ఆలోచిస్తున్నారని సమాచారం.
రాయలసీమలో వైసీపీ బలంగా వుంది. 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ సగం సీట్లను సీమలోనే దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితం కాగా, వైసీపీ 49 చోట్ల విజయకేతనం ఎగుర వేసింది. టీడీపీకే దిక్కు లేకుంటే, ఇక పార్టీ నిర్మాణమే లేని తన పార్టీ సీమలో ఏమీ చేయలేదని పవన్ అంచనాకు వచ్చారు. అందుకే సీమ మినహాయించి, మిగిలిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఆయన అంచనాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.