సరిగ్గా రెండేళ్ల కిందటి సంగతి.. కోకాపేటలో భూములు వేలం వేసింది హెచ్ఎండీఏ. అప్పట్లో గరిష్టంగా ఎకరాకు 60 కోట్ల రూపాయల ధర దక్కింది. అప్పట్లో ఆ రేటు చూసి వావ్ అనుకున్నారంతా. హెచ్ఎండీఏ అంచనా వేసిన మొత్తానికి రెట్టింపు ధర అది. అలా వార్తల్లోకెక్కిన కోకాపేట ఇప్పుడు మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచింది. ఈసారి రేట్లు చూస్తే కెవ్వుకేక అనాల్సిందే.
హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపొలిస్ వెంచర్ లో ఈరోజు వేలం నిర్వహించారు. ఈసారి ఎకరా ఏకంగా వంద కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. వెంచర్ లోని ప్లాట్-10లో ఎకరా 100 కోట్ల 25 లక్షలు పలికింది. ఈ ప్లాట్ విస్తీర్ణం 3.6 ఎకరాలుగా ఉంది.
నియోపొలిస్ ఫేజ్-2 ఈ-వేలంలో ఎకరా వంద కోట్ల రూపాయలకు వెళ్తుందనే అంచనా మొదట్నుంచి ఉంది. ఇప్పుడు అదే అంచనా నిజమైంది. హైదరాబాద్ చరిత్రలోనే గరిష్ట ధర ఇది. గతంలో పేజ్-1లో గరిష్ట ధరకు ఎకరాను కొనుగోలు చేసిన రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీనే, ఈసారి కూడా ఫేజ్-2లో ఎకరాకు గరిష్టంగా వంద కోట్ల రూపాయలకు పైగా కోట్ చేసింది.
కోకాపేటలో భూముల్ని వేలం వేయడానికి ప్రభుత్వం 2020లోనే ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా 49.92 ఎకరాల భూమిని వెంచర్ గా మార్చే ప్రక్రియ ప్రారంభించింది. ఈ వెంచర్ కు నియోపొలిస్ అనే పేరుపెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాపర్టీ ఇది.
నిజానికి ఈ వెంచర్ కు ఇంత క్రేజ్ రావడానికి మరో కారణం ఉంది. నేరుగా ఓఆర్ఆర్ నుంచి నియోపొలిస్ కు వెళ్లడానికి వీల్లేదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేటకు రావాలంటే భారీ ట్రాఫిక్ దాటాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన హెచ్ఎండీఏ దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టి, ట్రంపెట్ రూపంలో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసింది. దీని వల్ల ఎయిర్ పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా నేరుగా వెంచర్ లోకి వచ్చే వీలుంది. దీంతో ఈ భూములకు రేటు అమాంతం పెరిగింది.
2021లో పేజ్-1లో ఎకరాకు గరిష్టంగా 35 కోట్ల రూపాయలు అంచనా వేయగా.. 60 కోట్ల రూపాయలకు పైగా పలికింది. ఈసారి 80 కోట్ల రూపాయలు అంచనా వేయగా, 100 కోట్ల రూపాయలకు పైగా పలికింది. ఇలా ఎప్పటికప్పుడు అంచనాల్ని అధిగమిస్తూ, కోకాపేట వార్తల్లో నిలుస్తోంది.