జనసేనాని పవన్ కళ్యాణ్ తన మూడో విడత వారాహి యాత్రను కూడా ప్రకటించారు. రెండు విడతల యాత్రను ఉభయగోదావరి జిల్లాకు పరిమితం చేసి, ఆ రెండు జిల్లాల్లోనూ ఒక్క ఎమ్మెల్యే సెగ్మెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేస్తానని ప్రతిజ్ఞ పట్టిన పవన్ కళ్యాణ్, మూడో విడత యాత్రకు ఉత్తరాంధ్రవైపు మళ్లేరు.
ఈ ప్రయత్నం ద్వారా పవన్ కళ్యాణ్ తాను గత ఎన్నికలలో పోటీ చేసి దారుణంగా భంగపడిన రెండు నియోజకవర్గాలతో పాటు- ఆ పరిసర ప్రాంతాల నియోజకవర్గాల మీదనే ఈసారి ఎన్నికలకు గరిష్టంగా ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గాజువాక మరియు భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు.
ఇప్పుడు వారాహియాత్రను ఉభయగోదావరి జిల్లాలో సాగించి.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వనని అన్నారు. రేపు మూడో విడతలో విశాఖ జిల్లా వ్యాప్తంగా గానీ, ఆయనకు పూనకం వస్తే మొత్తం ఉత్తరాంధ్రలో కూడా వైసిపికి ఒక్క సీటు అయినా దక్కకుండా చేస్తానని మరో భీష్మ ప్రతిజ్ఞ చేయగలరు.
అయితే కాస్త లోతుగా గమనించినప్పుడు తాను విశ్వమానవుడిని అని చెప్పుకునే ఈ పవన్ కళ్యాణ్ కేవలం తన కుల బలం అధికంగా ఎక్కడ ఉన్నదో, కులం ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఎక్కడ ఉన్నదో.. ఆ ప్రాంతాలను మాత్రమే ఎంచుకుని అక్కడ మాత్రమే పోటీకి దిగే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
సభలు పెట్టిన సమయంలో రంకెలు వేయడంలో భాగంగా రాయలసీమ గురించి కూడా అవాకులు చవాకులు పేలుతూ ఉండే పవన్ కళ్యాణ్.. మూడో విడత యాత్ర చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతం వైపు దృష్టి సారించకపోవడమే తమాషా! నిజానికి వారాహి యాత్రను ఆయన మొట్టమొదటగా తిరుపతి నుంచి ప్రారంభించాలని సంకల్పించారు. అనుకున్న తేదీకంటే అనేక నెలల తర్వాత ఆయన యాత్ర మొదలైంది. ఈలోగా తిరుపతి సహా యావత్తు రాయలసీమ మీద ఆయన శ్రద్ధ కూడా మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాలో పూర్తిచేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు వెళుతున్నారు.
రాయలసీమలో అడుగు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ కు అంత భయమా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేను సైనికుడిని, నేను విప్లవకారుడిని అని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్.. ఏ జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతానని పదేపదే చెబుతున్నారో ఆ జగన్ సొంత ప్రాంతం వైపు అడుగు పెట్టడానికే జంకుతూ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాయలసీమ జిల్లాలలో చూస్తే తన సొంత కుల బలం.. పరిమితంగా కొన్ని నియోజకవర్గాల్లో తప్ప అధికంగా లేకపోవడం చేతనే పవన్ సీమను పట్టించుకోవడం లేదు అనేది ప్రధాన ఆరోపణ! మరి ఇలాంటి కులపరమైన వ్యూహాలతో ముందుకు సాగుతూ.. తనకు కులం లేదని మతం లేదని అందరూ తనను కలిపి నెత్తిన పెట్టుకొని ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఆత్మవంచనతో కూడిన మాటలు చెబుతూ ఉంటారో ఎవ్వరికి అర్థం కాని సంగతి!!