‘రాసి పెట్టుకోండి.. ఢిల్లీలో ఈసారి అధికారం మాదే..’ అంటూ బీజేపీ నేతలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు.. ఢిల్లీలో గత కొన్నాళ్ళుగా నడిపిన రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘అత్యంత ప్రముఖులు’గా బీజేపీలో చెప్పుకోబడ్డ నేతలంతా ఢిల్లీలో మోహరించారు. ప్రాంతాల వారీగా, కులాల వారీగా.. అక్కడ బీజేపీ రాజకీయాలు నడిపింది.
దేశ రాజధాని కావడంతో ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలుంటారు. అలా ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కడెక్కడ ఎక్కువగా వుంటారో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా ఓటు బ్యాంకు రాజకీయాల్ని చేపట్టారు బీజేపీ నేతలు. ఇక, ప్రలోభాల పర్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, మళ్ళీ సామాన్యుడు నిలబడ్డాడు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి అండగా. అవును, ఆ సామాన్యుడే మళ్ళీ పీఠమెక్కుతున్నాడు ఢిల్లీలో.
అరవింద్ కేజ్రీవాల్.. పరిచయం అక్కర్లేని పేరిది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఢిల్లీలో పుంజుకున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి, సగటు ఢిల్లీ ఓటరు ఆమ్ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపడం గమనార్హం. అయితే, గతంతో పోల్చితే బీజేపీ బాగా పుంజుకుందనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ ఎంత పుంజుకున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ హవాని మాత్రం అడ్డుకోలేకపోయింది.
అరవింద్ కేజ్రీవాల్‌కి ఇది ముచ్చటగా మూడో విజయం. మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారాయన. కానీ, రెండో సారి మాత్రం తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఈసారి విజయం చిన్నదేమీ కాదు. బీజేపీ రాజకీయాల్ని తట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ ఇన్నేళ్ళుగా నిలబడటం ఆషామాషీ వ్యవహారం కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ, ఎంతగా కేజ్రీవాల్‌ని రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేసినా.. అవేవీ ఆయన రాజకీయ ఎదుగుదలని అడ్డుకోలేకపోయాయని ఇంకోసారి నిరూపితమయ్యింది.