ఢిల్లీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను భారతీయ జనతా పార్టీ వాళ్లు అత్యంత తీవ్రంగా విమర్శించారు. కేజ్రీవాల్ ను బీజేపీ అన్నమాటలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. ఢిల్లీ ప్రచార పర్వంలో భాగంగా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ను అనరాని మాటలు కూడా అన్నారు. తాము దేశ భక్తులమని చెప్పుకుంటూ.. కొంతమంది కమలం పార్టీ వాళ్లు కేజ్రీవాల్ ను ఉగ్రవాది అని కూడా అన్నారు.
బీజేపీ వాళ్లకు, మోడీ భక్తులకు.. దేశద్రోహి, ఉగ్రవాది అనే మాటలు చాలా సహజం అయిపోయాయి. ఎవరు ఇండియాలో ఉండాలో, ఎవరు ఉండకూడదో కూడా వాళ్లే డిసైడ్ చేస్తూ ఉంటారు. బీజేపీ తీరును తప్పు పట్టిన వాళ్లంతా దేశద్రోహులు అయిపోవడం మొదలై చాలా కాలం అయిపోయింది. ఆ క్రమంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఉగ్రవాది అంటూ బీజేపీ వాళ్లు మాట్లాడారు.
చివరకు ఏమైంది? ఆయనే ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పగ్గాలు చేపట్టబోతూ ఉన్నారు. ఐదేళ్ల కేజ్రీవాల్ పాలనను ఢిల్లీ ప్రజలు మళ్లీ మెచ్చారు. ఐదేళ్ల కిందట 67 సీట్లను గెలవడం ఏ స్థాయి సంచలనమో, ఐదేళ్ల తర్వాత అందులో పది పన్నెండు సీట్లను తప్ప.. మిగతా అన్నింటిలోనూ విజయం సాధిస్తూ ఉండటం కూడా అంతే సంచలనం. అది కూడా విద్యాధికులు, వారితే పాటు లేబర్ కూడా అంతే ఎక్కువ స్థాయిలో ఉండే చోట.. ఐదేళ్ల తర్వాత కూడా అదే ఫలితాలను సాధించడం అంటే మాటలు కాదు.
కేజ్రీవాల్ పై బీజేపీ వాళ్లు తమ మార్కు దేశద్రోహ-ఉగ్రవాది ముద్ర వేయడమే కాదు, ఆయన పాలనా తీరును కూడా విమర్శించారు. అనేక లోటు పాట్లను ఎంచారు. బీజేపీని గెలిపించాలని, ఢిల్లీ డెవలప్ మెంట్ తన బాధ్యత అని మోడీ మైకు పట్టుకునిచెప్పారు. అయితే ఆ మాటలనేవీ ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదు. కమలం పార్టీకి వాత పెట్టారు. ఢిల్లీలో పాగా వేయాలన్న ఆ పార్టీ ప్రయత్నాలను ఓటర్లు తిప్పి కొట్టారు. కేజ్రీవాల్ కు తిరుగులేని విజయాన్ని అందించారు.