ఈ ‘కలయిక’ వెనుక ఎవరు?

పెద్దింట్లొ ఏమైనా జరుగుతుంటే, ఎవరు పడితే వారు వీడియోలు, ఫొటోలు తీసేంత దమ్ము, ధైర్యం వుండదు. అందులో విషాదంలో అందరూ మునిగిపోయి వున్నవేళ, వాళ్లకు అతి సమీపంలో వుండి, వాళ్లు చూస్తుండగానే ఫొటోలు, వీడియోలు…

పెద్దింట్లొ ఏమైనా జరుగుతుంటే, ఎవరు పడితే వారు వీడియోలు, ఫొటోలు తీసేంత దమ్ము, ధైర్యం వుండదు. అందులో విషాదంలో అందరూ మునిగిపోయి వున్నవేళ, వాళ్లకు అతి సమీపంలో వుండి, వాళ్లు చూస్తుండగానే ఫొటోలు, వీడియోలు తీయడం అంటే ఇంకా చిత్రం. అదీకాక ఎప్పడు సీరియస్ అవుతారో? ఎప్పుడు చెంప చెఢేల్ మనిపిస్తారో తెలియని నైజం వున్న వాళ్ల దగ్గరగా వుండి ఫోటోలు నేరుగా తీయడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయం. పోనీ ఇదేమన్నా పెళ్లా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసేసి, తరువాత ఫైనల్ గా ఓ మాంచి సిడిగా తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడానికి.

హరికృష్ణ మరణించిన తరువాత నుంచి బాలయ్య బాబు, చంద్రబాబులు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా మారిపోయిన ఫొటోలు బయటకు వస్తూనే వున్నాయి. చంద్రబాబు తన ఇరుపక్కలా హరికృష్ణ పిల్లలను కూర్చోపెట్టుకోవడం, బాలయ్య ఎన్టీఆర్ కు దగ్గరలోనే కూర్చోడం, ఇలా అని ఫోటొలు వచ్చాయి. సరే, ఇవంటే, పబ్లిక్ గానే జరిగిన వ్యవహారాలు కనుక ఎవరో ఒకరు క్లిక్ చేసారు అని సరిపెట్టుకోవచ్చు.

కానీ నిన్నటికి నిన్న ఎన్టీఆర్-బాలయ్య బఫే భోజనాలు చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. పైగా ఈ టైమ్ లో బాలయ్య-ఎన్టీఆర్ ముచ్చటించుకున్నట్లు కూడా క్లియర్ గా వుంది. మొబైల్ లో రికార్డు చేసిన వీడియో ఇది.

ఈ భోజనాలు నందమూరి ఫ్యామిలీ బంధువర్గం మధ్య జరిగిన చిన్న కర్మ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినవి. సాధారణంగా ఇలాంటివి చాలా  నిరాడంబరంగా, కామ్ గా జరుగుతాయి. వీడియోలు గట్రా తీసే వ్యవహారాలు వుండవు.

పైగా బాలయ్య-ఎన్టీఆర్ మాట్లాడుకుంటుంటే అక్కడే వుండి వీడియోలు ఎవరు తీస్తారు? పైగా ఎన్టీఆర్-బాలయ్య ఇద్దరిలో ఎవరైనా ఆగ్రహించే అవకాశం వుంది. ఈ వీడియో దొంగచాటుగా తీసింది కాదు. వేరే వాళ్లు వుండే అవకాశం లేదు. అంటే ఈ వీడియా కావాలనే తీసినట్లు, కావాలనే బయటకు వదిలినట్లు క్లియర్ అవుతోంది.

అంటే ఎన్టీఆర్ తో  ఇప్పుడు బాలయ్యకు కానీ, చంద్రబాబుకు కానీ ఎక్కడా దూరంలేదని క్లియర్ చేయాలనే తహతహ ఈ రిలీజ్ లు అన్నింటి వెంటా కనిపిస్తోంది అనుకోవాల్సి వస్తోంది.